ముందుగా ఈ పాట ఒకసారి చూడండి. తర్వాత వార్తలోకి వెళ్దాం.
“పిల్లలు దేవుడు చల్లని వారే
కల్లకపటమెరుగని కరుణామయులే
తప్పులు మన్నించుటే దేవుని సుగుణం
ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం
పిల్లలు దేవుడు చల్లని వారే
కల్లకపటమెరుగని కరుణామయులే
చరణం : 1
పుట్టినపుడు మనిషి మనసు తెరచియుండును
ఆ పురుటికందు మనసులో దైవముండును
వయసు పెరిగి ఈసు కలిగి మదము హెచ్చితే
అంత మనిషిలో దేవుడే మాయమగునులే
పిల్లలు దేవుడు చల్లని వారే
కల్లకపటమెరుగని కరుణామయులే
చరణం : 2
వెలుగుతున్న సూర్యుణ్ణి మబ్బు మూయును
మనిషి తెలివియనే సూర్యుణ్ణి కోపం మూయును
గాలి వీచ మబ్బు తెరలు కదలిపోవులే
మాట కలుపుకున్న కోపమే చెలిమి అగునులే
పిల్లలు దేవుడు చల్లని వారే
కల్లకపటమెరుగని కరుణామయులే

చరణం : 3
పెరిగి పెరిగి పిల్లలే పెద్దలౌదురు
ఆ పెద్దలేమో కలహిస్తే చిన్నబోదురు
మాయమర్మమేమి లేని బాలలందరు
ఈ భూమిపైన వెలసిన పుణ్యమూర్తులే
పిల్లలు దేవుడు చల్లని వారే
కల్లకపటమెరుగని కరుణామయులే”
నిజానికిది పాట కాదు,అక్షర సత్యం. ముద్దు మాటలతో అమాయకంగా పెద్దవాళ్ళు ఏం చేస్తే అదే నేర్చుకునే పసి వారంటే మెచ్చని వారుంటారా? ఆ ధీమాతోనే ఎంతోమంది తల్లిదండ్రులు ఉద్యోగాలకెళ్తూ పిల్లల్ని కేర్ సెంటర్లు, స్కూళ్లలో వదిలి వెళ్తారు.
నేనూ ఆ బాధకు అతీతం కాదు. నా ఏడాది పిల్లాడిని కేర్ సెంటర్లో వదిలి ఆఫీసు కి వెళ్లాల్సి వచ్చేది. అయితే అక్కడ ఎంతో బాగా చూసుకునేవారు. ఒకోసారి నా ఆఫీసుకి బాబుతో వచ్చి నా పని అయ్యేవరకు చూసుకునేవారు.
భార్యాభర్తలిద్దరూ పనిచేస్తే కానీ గడవని రోజుల్లో పిల్లలను ఇలా వదలడం తప్పదు. ఆ తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉండాల్సిన బాధ్యత ఆయా స్కూళ్ల యాజమాన్యాలు, సిబ్బంది ది. గతంలో ఇళ్లలో ఉండే పనివారు పిల్లల్ని విసుక్కున్న, కొట్టిన వీడియోలు బయటికొచ్చి అందర్నీ భయపెట్టాయి. తాజాగా హైదరాబాద్లో ఒక ప్రైవేటు స్కూల్లో ఆయా చిన్నపిల్లని దారుణంగా కొట్టిన వీడియో బయటికొచ్చింది. ఇక్కడ పాప తల్లిదండ్రులూ అదే స్కూల్లో పని చేస్తున్నారు. నాలుగేళ్ళ పాప అని చూడకుండా ఆయా కొట్టడాన్ని పక్కింట్లో వ్యక్తి వీడియో తీసి షేర్ చేశాడు. అది చూసి విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు గుండెలు బాదుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక్కడ తప్పు ఆయాది మాత్రమే కాదు, ఆమె కొడుతుంటే ఆపకుండా వీడియో తీసిన వ్యక్తిది కూడా అని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. నిజమే కదా! ఎంత మొద్దుబారిపోయాం మనం? రోడ్డు ప్రమాదమైనా, ఏ ఇద్దరు కొట్టుకున్నా ఎంత నష్టం అయినా ముందు వీడియో తీసి పెడుతున్నామంటే మనుషులుగా చచ్చిపోతున్నామా? ఈ విషయం పైనా చర్చ జరగాల్సిన సమయం వచ్చేసింది. ఇప్పటికే సెల్ ఫోన్లలో, రీల్స్ లో కూరుకుపోయిన యువత ను మేలుకొలపాల్సిన అవసరం ఉంది. అందుకు ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలి. మానసిక ఆరోగ్యనిపుణులు దృష్టి సారించాలి. ఈ విధమైన పోకడలను అరికట్టకపోతే మనిషిలోని దేవుడు మాయమయి దానవుడు ప్రవేశించినట్టే.
-కె. శోభ

