Sunday, January 19, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంకూటి కోసం కోటివిద్యలు

కూటి కోసం కోటివిద్యలు

A True innovation:
కాకి ముక్కుకు దొండపండు.
కాకుల్లా పొడుచుకు తినడం.
కాకిలా కలకాలం బతికేకన్నా హంసలా కొద్దికాలం ఉన్నా చాలు..
ఇలా తెలుగులో కాకికి ప్రాముఖ్యత ఎక్కువే. నీళ్లకోసం కూజాలో రాళ్లు వేసిన తెలివి గురించీ చదివాం. కానీ ఎక్కువశాతం కాకిని అవమానించే సామెతలే ఉంటాయి. చేరదీసే వాళ్ళు ఉండరు. కలకాలం కాకిలా బ్రతకాలనీ అనుకోరు. పైగా అవమానించాలంటే కాకితో పోలుస్తారు. ఇప్పుడవే కాకులు స్వీడన్ లో చెత్త ఏరి పారేసే పనిలో బిజీగా ఉన్నాయట. పైగా దానివల్ల వాటికి ఆహారం కూడా దొరుకుతోందట. ఆశ్చర్యంగా ఉంది కదూ!


స్వీడన్లో జనాలు సిగరెట్లు తాగి రోడ్లపై పారేస్తున్నారట. ఇలా రోడ్లన్నీ తాగి పారేసిన సిగరెట్ పీకల్తో నిండిపోయి మున్సిపాలిటీ వాళ్ళకి శుభ్రం చేయడానికి కోట్లలో ఖర్చు అవుతోంది. అయితే అక్కడి కొర్విడ్ జాతికి చెందిన న్యూ కెలడోనియా కాకులు తెలివైనవి. ఏం చెప్పినా ఇట్టే నేర్చుకుంటాయట. పక్కవాటికీ నేర్పిస్తాయి. దాంతో ఒక స్టార్ట్ అప్ కంపెనీ వారు ఆ కాకులకు సిగరెట్ పీకలు ఏరి డబ్బాలో వేసేలా శిక్షణ ఇచ్చారు. అంతేకాదు, డబ్బాలో ఒకవైపు చెత్త వేయగానే రెండో వైపు ఆహారం వచ్చే ఏర్పాటు చేశారు.

కొర్విడ్ క్లీనింగ్ అనే సంస్థ ఈ శిక్షణ ఇస్తుంది. దీనికయ్యే ఖర్చూ తక్కువే. దాంతో మున్సిపాలిటీ వాళ్ళు ఈ సంస్థకు అప్పగించారు. త్వరలో అన్ని రకాల పక్షులకూ ఇటువంటి శిక్షణ ఇస్తామని చెప్తున్నారు. అంతా బానే ఉంది కానీ ఇంకా మనుషుల్లో బద్ధకం పెరిగిపోతుందని కొందరు పెదవివిరుస్తున్నారు. కొన్నాళ్ళు పోతే చెత్త వేసే వారిని పొడుస్తాయని కూడా కామెంట్లు చేస్తున్నారు. భారత్ లాంటి దేశాల్లో ఎందరో బాలలు చెత్త ఏరుకునే వృత్తిలో ఉన్నారు. రోడ్ల పైన చెత్తకూ లోటు లేదు. అటువంటి చోట ఇటువంటి విధానం ఆలోచిస్తే మంచిదేమో!

-కె . శోభ

Also Read : డిజిటల్ విధ్వంసం

RELATED ARTICLES

Most Popular

న్యూస్