Friday, April 19, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకండిజిటల్ విధ్వంసం

డిజిటల్ విధ్వంసం

Smart phones consequences: మంత్రాలకు చింతకాయలు రాలుతాయో, లేదో తెలియదుగానీ… మొబైల్ ను చేతిలో పట్టుకుని ప్రపంచాన్నంతా చుట్టేసెంత సాంకేతికత తమ సొంతమైందని అనుకుంటున్న నేటిరోజుల్లో అదే మొబైల్ తో మతిస్థిమితం కోల్పోయాడని భావించి మళ్లీ మంత్రగాళ్లకే చూపిండమంటే అది ఈ 21వ సెంచురీకే ఓ విడ్డూరమైన విశేషమే!
‘సెల్లే పన్నీరు చలుతుందా.. మన అందరి బతుకుల ఇల్లే బందీయై పోతుందా.. అది చూసిన గడియల కూసుని కూసుని తిమ్మిరు లొచ్చెను.. చూసి చూసి రెండు కండ్లు నొచ్చెను..పెద్ద మెదడుకా మొద్దుబారినది.. సక్కని సేతుల సడుగులిరిగినవి.. చూపుడు వేళ్ళకు తీపులెక్కువాయే.. ఈ సెల్లులతోనీ శ్రమసౌందర్యం చెదలు పట్టి పాయే ఆ పల్లెల్లోనా..’ అన్నారు అదే సెల్ ఫోన్ చేతులో పట్టుకుని  ఫేస్బుక్ లో అప్లోడ్ చేసి  భాషాపండితులు, కేంద్ర సాహిత్య అకాడమీ గ్రహీత నలిమెల భాస్కర్.
అంతేకాదు… ‘సద్వినియోగం చేస్తే సెల్లూ తల్లి వంటిదీ, చెల్లి వంటిదీ.. దుర్వినియోగపరిస్తె బాబూ నిను దున్నిపోతదీ, దునుమాడుతదీ.. వస్తుసంస్కృతికి బానిస కావొద్దూ.. మనిషేనాటికి మానవమూల్యాల్ మణి మాణిక్యాలూ ఈ నరజాతికి’ అని ఆయన ముక్తాయింపిచ్చిన తీరుకు ఓ ఉదాహరణలా నిలుస్తోంది అనంతపురం జిల్లాలో ఈమధ్య జరిగిన ఓ ఘటన.
నిజంగా మరి సెల్ ఫోన్ అనర్థమేనా అంటే…? ముమ్మాటికీ కాదు. కానీ దాన్నో సిగరెట్ లాగో, మద్యానికి బానిసైన తరహాలోనో.. పేకాటాడందే రోజు గడవని దుర్వ్యసనంలానో మార్చుకుంటేనే అది అనర్థం తప్ప… అది నిజంగా మానవ ప్రపంచం సాధించిన సాంకేతికకు కచ్చితంగా ఓ గీటురాయే!  అయితే అనంతపురం జిల్లా కణేకల్లు  మండలం బెణకల్లులో మహేష్ అనే 19 ఏళ్ల యువకుడు స్మార్ట్ ఫోన్ కు బానిసై మతిస్థిమితం కోల్పోయినటువంటి ఘటన ఈమధ్య సెల్ ఫోన్ తీవ్రతను పట్టిచూపేదైతే… అత్యాధునిక సాంకేతికత.. బాగా చదువుకున్నోళ్లనే అడిక్ట్ అయ్యేలా చేస్తున్న మొబైల్ రోజుల్లో.. ఇంటర్ మధ్యలో ఆపేసి తాపీ మేస్త్రీగా సంపాదించుకున్న డబ్బుతో సెల్ కొన్న ఆ యువకుడిపై అంతలా ప్రభావం చూపడం.. సమస్య పరంగా తీవ్రమైందే అయినప్పటికీ.. ఓ సర్వసాధారణ ప్రక్రియగానే చూడాల్సి ఉంటుంది. ఇక్కడివరకూ ఈ కథ టెక్నాలజీ మనుషులను ఎలా శాసిస్తుందో చెప్పేదైతే.. అంత అత్యాధునిక టెక్నాలజీతో మతిస్థిమితం కోల్పోయి ఎవరితో ఏం మాట్లాడుతున్నాడో తెలియని పరిస్థితుల్లో నాగరిక యువకుడైన మహేష్ తల్లిదండ్రులు.. అతణ్ని  ఓ మంత్రగాడికి చూపించడమనేది… నాగరిక కాలంలో ఓ ఆటవిక, అంతకుమించి ఓ అనాగరిక చర్యగానే చూడాల్సి ఉంటుందేమో..?!!
అయితే ఎవరి నమ్మకాలు వారివి! అది వారికి నమ్మకం.. నమ్మనివారికి మూఢనమ్మకం!! జడ్జ్ మెంట్ ఇచ్చేందుకు మనమెవ్వరమూ…? కానీ..  మొబైల్ వేదికగా పబ్జీ వంటి గేమ్స్ తో మూడు నెలలు సరిగ్గా నిద్ర కూడా లేకుండా ఆరోగ్యాన్ని పాడుచేసుకున్న మహేష్ లాంటివాళ్లెందరో… ఇప్పుడు తారసపడుతూనే ఉన్నారు. వ్యాధి తీవ్రతల్లో తేడా తప్పిస్తే… మోబైల్ అడిక్షన్ లో అందరిదీ ఇప్పుడు పీక్ స్టేజే!

Smart Phones

మోబైల్ వేదికగా కూడా ఆన్ లైన్ రెమ్మీ ఆటలాడి సంపాదించుకున్నదంతా  పోగొట్టుకుంటున్నవాళ్లూ.. అదే మోబైల్ లో వచ్చిన మెస్సేజెస్ తోనూ, స్పామ్ కాల్స్ కు స్పందించడంతోనూ… ఎనీ డెస్క్ వంటి యాపులను డౌన్ లోడ్ చేసుకుని.. అవతల నుంచి సైబర్ నేరగాళ్లు చెప్పే కాకమ్మ కథలు విని.. ఇల్లు గుల్ల చేసుకుంటున్నవాళ్లూ.. అసలు మోబైల్ ఫోన్లలో టీవీ సీరియళ్ల నుంచి మొదలు ఇంట్లో వంటకాల వరకూ ట్యూబ్ లైట్లు బంద్ చేసుకుని ట్యూబుల్లో చూస్తున్న వాళ్లు.. పిల్లలకూ ఓ మోబైల్ ఇచ్చేస్తే వాళ్లు మన జోలికి రారన్నట్టుగా వారి భవిష్యత్ భారతం గురించి పూచిక పుల్లంతైనా రందిలేనివారు.. ఆర్కే లక్ష్మణ్ కార్టూన్ భాషలో చెప్పాలంటే..  ఇంటిల్లిపాదీ ఓ కుక్కను కట్టేసినట్టుగా.. తమకు తెలువకుండానే సెల్ ఫోన్ తో బందీ అయిపోతున్న పరిస్థితులు.. మోబైల్ మానవులను పురోగతి వైపు నడిపించడం కంటే.. తిరోగమన దశకు చేరుస్తున్న తీరు మాత్రం కళ్లకు కట్టేదే!

అయితే అది మానవుడు సృష్టించిన  సాంకేతిక అద్భుతమైన సెల్ తప్పు ముమ్మాటికీ కాదు.. దాన్ని సృష్టించిన మానవుడే దానికి కట్టుబానిసవ్వడం మనిషి బలహీనతకు మాత్రం ఓ పరాకాష్ఠ!! అయితే దాన్ని సవరించుకోవాల్సిన పెద్దలే మోబైల్ లేందే వెళ్లని పరిస్థితుల్లో కూరుకుపోతుంటే… మహేష్ లాంటి పిల్లలు ఏ గతి బాగుపడునన్నదే ఇప్పుడు సమాధానం లేని ప్రశ్న..?
-రమణ కొంటికర్ల
Also Read :
RELATED ARTICLES

Most Popular

న్యూస్