Saturday, March 7, 2026
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంచిల్లర పోగేసి స్కూటర్ కొన్న తండ్రులు

చిల్లర పోగేసి స్కూటర్ కొన్న తండ్రులు

ఛత్తీస్ ఘడ్ లో బజరంగ్ రామ్ భగత్ అనే రైతు వాళ్ళ అమ్మాయి చంపాకి మొన్న అక్టోబరులో హోండా ఆక్టీవా స్కూటర్ కొని వార్తల్లోకెక్కాడు.

పశ్చిమబెంగాల్లో టీ స్టాల్ నడిపే బచ్చు చౌదరి సైతం ఈ నవంబర్లో తన కూతురికోసం స్కూటర్ కొని వార్తల్లో వ్యక్తి అయ్యాడు.

అదేంటి? స్కూటర్ కొనడం వార్త ఎలా అవుతుంది? ఈ రోజుల్లో చాలామంది తండ్రులు కూతుళ్ళకు కొంటున్నారు కదా అని తొందరపడి అనకండి. నిజంగానే ఇక్కడో విశేషం ఉంది. ముందు ఛత్తీస్ ఘడ్ బజరంగ్ సంగతే తీసుకుంటే ఏడు నెలలు 1,2,5,10 రూపాయల నాణాలు కూడబెట్టాడు. అవన్నీ పెద్దసంచిలో తీసుకెళ్లి షోరూంలో ఇచ్చాడు. అంతా కలిపి నలభై వేలు ఉంది. మిగిలిన దానికి లోన్ తీసుకున్నాడు. ఈ తండ్రి ప్రేమ స్కూటర్ షోరూం వాళ్ళని ఎంత కదిలించిందంటే గంటల తరబడి లెక్కపెట్టినా విసుక్కోలేదు. పైగా ఒక మిక్సీ కూడా ఇచ్చారట.

పశ్చిమబెంగాల్ టీ వ్యాపారి బచ్చు చౌదరి విషయం చూస్తే తన కూతురు కలలుగన్న స్కూటర్ కోసం నాలుగేళ్లు చిల్లర పోగేశాడు. మరోపక్క కూతురు కూడా తన ఖర్చు తగ్గించుకుని పదివేలు పొదుపు చేసింది. ముందే షోరూం వాళ్ళు నాణాలు తీసుకుంటారా అని అడిగి మరీ తీసుకెళ్లారు వీళ్ళు. డ్రమ్ము నిండా నాణాలు నింపుకొని వచ్చిన తండ్రీ కూతుళ్ళని చూసి షోరూం వాళ్ళకి మతిపోయింది. తేరుకుని రెండు గంటలు లెక్కపెడితే స్కూటర్ కి సరిపడా మొత్తం ఉందట. ఏ లోనూ లేకుండా స్కూటర్ కొన్నాడన్నమాట.

ఈ రెండు సంఘటనలు తండ్రి ప్రేమకు, పొదుపు స్ఫూర్తికి ఉదాహరణలు. అందుకే చిల్లర దొరకడం లేదని అక్కడక్కడ సణుగుతున్నా ఎక్కువమంది ఆ తండ్రులని మెచ్చుకుంటున్నారు. అవును మరి!

కొంతమంది కడుపు కట్టుకుని కూడబెడతారు. కొందరేమో పైసా పైసా కూడబెట్టామంటారు . ఈ కాలానికి తగ్గ పోలిక కాదనిపించినా ఈ ఇద్దరు తండ్రులు అదేపని చేశారు. వారి కూతుళ్ళ మనసు కష్టపడకుండా తాము కష్టపడి అచ్చంగా పైసల నాణాలు కూడబెట్టి స్కూటర్ కొన్న వైనం కంట తడి పెట్టిస్తుంది. గుండెలోని తడిని కంటికి చేర్చే వార్త కాబట్టే ప్రపంచమంతా చుట్టేసింది. ఆ తండ్రులకు అభినందన మందారమాలలు వేస్తూనే ఉంది.

-కె. శోభ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular