యువ హీరో శర్వానంద్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. ఈ మూవీకి కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శర్వానంద్ సరసన క్రేజీ హీరోయిన్ రష్మిక మందన్నా నటిస్తోంది. నేడు ఈ మూవీ షూటింగ్ రాజమండ్రిలో ప్రారంభమైంది. దాదాపు 80 శాతం షూటింగ్ పూర్తి కానున్న ఈ షెడ్యూల్ లో ప్రధాన తారాగణం పాల్గొంటున్నారు. ఈ షెడ్యూల్‌తో దాదాపు టాకీ పార్ట్ పూర్తి కానుంది.
దసరా కానుకగా ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేయగా అద్భుతమైన స్పందన వచ్చింది. శర్వానంద్, రష్మిక జోడి ఎంతో ఫ్రెష్‌గా కనిపించడంతో ఆడియెన్స్ కనెక్ట్ అయినట్టు తెలుస్తోంది. ఈ సినిమాతో శర్వానంద్ మొదటిసారిగా రష్మిక మందన్నా, కిషోర్ తిరుమలతో కలిసి పని చేస్తున్నారు. శర్వానంద్ ఈ చిత్రంలో పక్కింటి అబ్బాయిలా కనిపిస్తున్నారు. రష్మిక అద్భుతమైన పాత్రను పోషిస్తోంది. టైటిల్‌ను బట్టి చూస్తే ఈ చిత్రం మహిళలకు ప్రాధాన్యతను ఇచ్చేట్టుగా కనిపిస్తోంది.
ఈ చిత్రంలో కుష్బూ, రాధిక శరత్ కుమార్, ఊర్వశీ వంటి వారు ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తుండగా, వెన్నెల కిషోర్, రవి శంకర్, సత్య, ప్రదీప్ రావత్, గోప రాజు, బెనర్జీ, కళ్యాణీ నటరాజన్, రాజశ్రీ నాయర్, ఝాన్సీ, రజిత, సత్య కృష్ణ, ఆర్సీఎం రాజు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.