Mini Review: ఏ హీరోకైనా ఒక ఓ ఇమేజ్ .. క్రేజ్ ఉంటాయి. వాటికి తగిన పాత్రలు చేయాలి .. వయసుకి తగిన డైలాగ్స్ చెప్పాలి. ఇప్పుడిప్పుడే కెరియర్ ను ఆరంభించిన హీరోలు బాలకృష్ణ రేంజ్ డైలాగ్స్ చెబితే .. చిరంజీవి రేంజ్ ఫైట్లు చేస్తే ఆడియన్స్ రిసీవ్ చేసుకోవడం కష్టమైన విషయమే. ఆ విషయాన్ని పట్టించుకోకుండా అలా తెరపైకి వచ్చేస్తే ఆడియన్స్ కి అది ‘అతి’గా అనిపిస్తుంది. ‘ఆదికేశవ’ సినిమాకి వెళ్లిన ప్రేక్షకులకు ఇలాంటి అనుభవమే ఎదురవుతుంది. థియేటర్స్ బయట అదే టాక్ వినిపిస్తోంది.
ఈ సినిమాలో హీరో స్వభావం పరంగా చాలా సెన్సిటివ్. తల్లి విషయంలో .. చిన్న పిల్లల విషయంలో వెంటనే చలించిపోయే స్వభావం ఉన్నవాడు. సాధారణంగా ఇలాంటివారు హింసకి ఎక్కువగా పాల్పడలేరు. కానీ ఈ సినిమాలో హీరో సున్నితమైన విషయాల పట్ల చాలా కిరాతకంగా స్పందిస్తూ ఉంటాడు. ‘మా చిన్నోడు తేడా వస్తే నరరూప రాక్షసుడే’ అని తల్లే గొప్పగా చెబుతూ ఉంటుంది. అందుకు తగినట్టుగానే హీరో ఒక రేంజ్ లో రెచ్చిపోతుంటాడు. ఈ విజృంభణను ఆడియన్స్ తట్టుకోలేని పరిస్థితి.
హీరో అంటే అన్యాయాన్ని ఎదిరిస్తాడు .. అక్రమాలకు పాల్పడే వారిని నిలదీస్తాడు. అది హీరో లక్షణమే అయినా, తెరపై దానిని చూపించడానికి ఒక పరిధి ఉంటుంది. విలన్ కంటే హీరో చూపించే రాక్షసత్వం ఎక్కువగా ఉండకూడదు. అలా జరిగినప్పుడు ఆ యాక్షన్ వెనుక ఉన్న ఎమోషన్ పక్కకి వెళ్లిపోతుంది. ఆ విషయాన్ని ఆడియన్స్ మరిచిపోతారు. హీరో కాబట్టి హీరోయిన్ అతనినే లవ్ చేయాలి అనే ప్రధాన సూత్రం పక్కన పెట్టడం కుదరదు కాబట్టి, అందుకు తగిన సీన్స్ ను డిజైన్ చేసుకోవాలి. లేదంటే సహజత్వం దెబ్బతింటుంది. ఈ సినిమా విషయంలో అది కూడా జరిగింది మరి.