Capital Punishment: గుంటూరుకు చెందిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో నిందితుడు శశి కృష్ణకు ఉరిశిక్ష విధిస్తూ ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. తన ప్రేమను నిరాకరించినందుకు ఆగస్టు 15 వ తేదీ ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఎన్ రమ్య అనే బి టెక్ చదువుతున్న దళిత విద్యార్థినిని అతిదారుణంగా నడిరోడ్డుపై శశికృష్ణ అనే ఉన్మాది ఆమె గొంతుపైన, పొట్టమీద 8 సార్లు అత్యంత దారుణంగా పొడిచి చంపాడు. ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. అత్యంత హేయమయిన ఈ కేసు విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేశారు. శశికృష్ణను 24 గంటల్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత ఏడాది డిసెంబర్‌లో ప్రారంభమైన విచారణ ఈనెల 26న ముగిసింది.
సమగ్ర విచారణ, ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం 4వ ప్రత్యేక న్యాయమూర్తి రాంగోపాల్ నేడు తుది తీర్పు వెలువరించారు. నిందితుడికి హైకోర్టులో అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. 257 రోజుల్లోనే ఈ కేసులో తీర్పు రావడం విశేషం.