PC Reddy No more! ప్రముఖ సినీ దర్శకుడు పి. చంద్రశేఖర్ రెడ్డి ఈరోజు ఉదయం 8.30 లకు చెన్నైలో మృతి చెందారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. సుమారు 80 చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. అయితే.. సూపర్ స్టార్ కృష్ణ చిత్రాలకు ఆయన ఎక్కువగా దర్శకత్వం వహించారు.
పి.సి.రెడ్డి పూర్తి పేరు పందిళ్లపల్లి చంద్రశేఖర్ రెడ్డి. ఆయన స్వస్థలం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని అనుమసముద్రం గ్రామం. పందిళ్లపల్లి నారపరెడ్డి, సుబ్బమ్మ దంపతులకు ఆయన జన్మించారు. 1959లో అసిస్టెంట్ డైరెక్టర్ గా సినీరంగ ప్రవేశం చేశారు. వి.మధుసూదనరావు, ఆదుర్తి సుబ్బారావు వద్ద సహాయ దర్శకుడిగా, సహ దర్శకుడిగా పని చేశారు. ‘అనురాధ’ సినిమాకు మొదటిసారి దర్శకత్వం వహించారు.
‘భలే అల్లుడు’, ‘మానవుడు దానవుడు’, ‘కొడుకులు’, ‘జగన్నాయకుడు’, ‘బడిపంతులు’, ‘విచిత్ర దాంపత్యం’, ‘రగిలే గుండెలు’, ‘నవోదయం’, ‘పాడిపంటలు’, ‘బంగారు కాపురం’, ‘రాజకీయ చదరంగం’, ‘అన్నా వదిన’, ‘పెద్దలు మారాలి’, ‘పట్నవాసం’, ‘అన్నాచెల్లెలు’ తదితర విజయవంతమైన చిత్రాలకు పి.సి.రెడ్డి దర్శకత్వం వహించారు. ఆయన మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.