Shocking news: ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణంపై అన్ని పార్టీల నేతలు, వివిధ రంగాల ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు తీవ్ర విచారాన్ని వెలిబుచ్చారు. ” ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల, ఐటీ శాఖ మంత్రి శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి పరమపదించడం అత్యంత విచారకరం. వారు ఎంతో సౌమ్యులు, సంస్కారవంతులు. ప్రజా సమస్యల పట్ల అవగాహన, చేసే పని పట్ల నిబద్దత కలిగిన నాయకులు” అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు.
గౌతమ్ రెడ్డి తన రాజకీయ జీవితంలో ఏనాడూ వివాదాల జోలికి వెళ్ళలేదు, తనపై ఎవరైనా విమర్శలు చేసినా వాటిని విధానపరంగా తిప్ఫి కొట్టేవారే కానీ ఎన్నడూ పరుష పదజాలం వాడలేదు. అందరినీ నవ్వుతూ పలకరించేవారు. రాజకీయ విభేదాలున్నా అన్ని పార్టీల నేతలతో ఎంతో కలివిడిగా ఉండేవారు. విజయవాడలో తాను నివాసం ఉండే ప్రాంతంలో కూడా చుట్టుపక్కల వారితో ఎంతో ఆప్యాయంగా పలకరించేవారని అక్కడి స్థానికులు చెబుతున్నారు.
తాను నిర్వహించే శాఖల పనితీరుపై ఎప్పటికప్పుడు సమీక్షలు చేసి అధికారులకు తగు సూచనలు ఇచ్చేవారు. వారం రోజులుగా దుబాయి లో జరింగ్ ఎక్స్ పో లో పాల్గొని రాష్ట్రానికి 5 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు సైతం తీసుకురావడంలో అయన ఎంతో కృషి చేశారు. దుబాయ్ నుంచి తిరివి వచ్చిన మర్నాడే అయన హఠాత్తుగా మరణించడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది.