మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల వేడి మూడు నెలల ముందే మొదలు కావడం, కొంతమంది వ్యాఖ్యలతో వివాదస్పదమవ్వడం తెలిసిందే. ఈసారి ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ మా అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. అంతే కాకుండా.. అన్నయ్య చిరంజీవిని కలిసి ఈ విషయం చెప్పానని.. తనకు అన్నయ్య చిరంజీవి మద్దతు ఉందని కూడా చెప్పారు. మెగా బ్రదర్ నాగాబాబు కూడా సపోర్ట్ చేస్తున్నానని చెప్పడం జరిగింది. ఆతర్వాత మంచు విష్ణు, జీవిత, హేమ, సివిఎల్ నరసింహారావు.. ఇలా రోజుకొకరు మా అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది.
ఆ తర్వాత ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అని.. ఆయన తెలుగు నటీనటుల సంఘం అధ్యక్ష పదవికి ఎలా పోటీ చేస్తారని కొంత మంది నటీనటులు, సాంకేతిక నిపుణులు ప్రశ్నించడంతో వివాదం మరింతగా ముదురుతుంది. ఇదిలా ఉంటే.. సీనియర్ హీరో సుమన్ నాన్ లోకల్ వివాదం గురించి స్పందించారు. దేశంలో పుట్టిన ప్రతిఒక్కరూ లోకల్ కిందే లెక్కని.. కాబట్టి అందరూ కలిసి కట్టుగా ఉండాలని.. లోకల్-నాన్‌లోకల్ అనే వ్యవహారం గురించి ప్రస్తావించడం అర్థరహితమన్నారు సుమన్. వైద్యులు, రైతులు నాన్‌లోకల్ అనుకుంటే ప్రజలకు చికిత్స, ఆహారం అందవని ఆయన తెలిపారు. ఈ రకంగా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్‌కు సుమన్ పరోక్షంగా మద్దతు ప్రకటించినట్లు అయ్యింది.