Great Loss: ప్రముఖ నటి మీనా భర్త విద్యాసాగర్ (48) మంగళవారం రాత్రి చెన్నైలో మరణించారు. ఆయనకు తీవ్రమైన శ్వాసకోశ సమస్య ఉందని, గత కొన్ని నెలలుగా దానికి చికిత్స పొందుతున్నారని తెలిసింది. జనవరిలో మీనా కుటుంబం మొత్తానికి కరోనా వచ్చింది. ఆ తర్వాత నుంచి ఆయన ఆరోగ్య సమస్య మరింత తీవ్రమైంది. ఊపిరితిత్తులు మార్పిడి చేయాల్సి ఉండగా.. డోనర్ లేక వాయిదా పడుతోందని.. ఈ క్రమంలో ఆరోగ్యం విషమించిందని సమాచారం. బుధవారం విద్యాసాగర్ అంత్యక్రియలు జరగనున్నట్లు సినీ వర్గాలు వెల్లడించాయి .
విద్యాసాగర్ మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ‘విద్యాసాగర్ ఆత్మకు శాంతి చేకూరాలి.. మీనా, ఆమె కుటుంబసభ్యులకు మా కుటుంబం సంతాపం వ్యక్తం చేస్తోంది’ అని సీనియర్ నటుడు శరత్‌కుమార్ ట్వీట్ చేశారు. బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ విద్యాసాగర్‌ను మీనా 2009లో పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు నైనిక అనే కుమార్తె ఉంది. ఇటీవల మీనా.. దృశ్యం 2 సహా పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరోవైపు ఆమె కుమార్తె నైనిక కూడా కొన్నాళ్ల క్రితం తళపతి విజయ్ హీరోగా తెరకెక్కిన ‘థేరీ’ చిత్రంతో అరంగేట్రం చేసింది