Friday, November 22, 2024
Homeసినిమాసామాజిక, కుటుంబ విలువలు నేర్పిన ఆదుర్తి సినిమాలు

సామాజిక, కుటుంబ విలువలు నేర్పిన ఆదుర్తి సినిమాలు

Adurthi Movies –  Social Values:
తెలుగు సినిమా గురించి చెప్పుకోవాలంటే ఒక కేవీ రెడ్డి .. ఒక బీఎన్ రెడ్డి .. ఒక ఆదుర్తి సుబ్బారావు అనే చెప్పుకుంటారు
. జానపద .. పౌరాణిక చిత్రాల పట్ల కేవీ రెడ్డికి ఎంత పట్టు ఉందో .. సాంఘిక చిత్రాల పట్ల ఆదుర్తి సుబ్బారావుకి అంత పట్టు ఉందని అనేవారు. కథ .. స్క్రీన్ ప్లే పై ఆయనకి మంచి పట్టు ఉండేది. అలాగే తన సినిమాలకి సంబంధించిన సందర్భాలలో ఎలాంటి పాటలు చేయించుకోవాలనే అవగాహన కూడా ఆయనకి మెండుగా ఉండేది. అందువలన కథాకథనాల పరంగానే కాకుండా, పాటల పరంగా కూడా ఆయన సినిమాలు సూపర్ హిట్స్ అనిపించుకున్నాయి. 

ఆదుర్తి పుట్టి పెరిగిందంతా రాజమండ్రిలోనే. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఆయన, కొంతకాలం పాటు కాకినాడలోను విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. కాలేజ్ రోజుల నుంచి ఆయనకి సినిమాల పట్ల ఆసక్తి పెరగడం  మొదలైంది. వీలైతే సినిమాలు .. లేదంటే నాటకాలు అన్నట్టుగా ఆయన ధోరణి ఉండేది. దాంతో సహజంగానే చదువుపై ఆయనకి ఆసక్తి తగ్గడం మొదలైంది. ఇష్టమైన పని చేయడంలోనే సంతృప్తి ఉంటుందని భావించిన ఆయన, సినిమాల్లోనే ఏదో ఒకటి చేయాలి అని బలంగా నిర్ణయించేసుకుని బొంబాయి చేరుకున్నారు. 

అయితే అక్కడి మనుషులను .. పరిస్థితులను అర్థం చేసుకుని సర్దుకుపోవడానికి ఆయనకి కొంత సమయం పట్టింది. సినిమాల్లో అవకాశాలను  సంపాదించు కోవడం సినిమా చూసినంత తేలిక కాదనే విషయం ఆయనకి అర్థమైంది. కానీ మళ్లీ వెనక్కి వెళ్లే ఆలోచన చేయలేదు. కష్టమైనా .. నష్టమైనా అక్కడే తేల్చుకోవాలనే పట్టుదలతో ముందుగా పరిచయాలు పెంచుకోవడం మెదలుపెట్టారు. సినిమాకి సంబంధించి ఏ శాఖలో అవకాశం వస్తే ఆ శాఖలో చేరిపోవాలనే ఉద్దేశంతో ఆయన  ఫొటోగ్రఫీ నేర్చుకున్నారు. ఆ తరువాత ఒక సీనియర్ ఎడిటర్ దగ్గర పనిచేస్తూ ఎడిటింగ్ నేర్చుకున్నారు.

అలా తొలినాళ్లలో నేర్చుకున్న ఫొటోగ్రఫీ .. ఎడిటింగ్, ఆ తరువాత కాలంలో ఆయన దర్శకుడిగా నిలబడటానికి ఎంతో హెల్ప్ అయింది. కొన్ని సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన ఆదుర్తి సుబ్బారావు, ఆ తరువాత ‘తోడికోడళ్లు’ సినిమాతో తెలుగు తెరకి దర్శకుడిగా పరిచయమయ్యారు. 1957లో వచ్చిన ఈ సినిమా అనూహ్యమైన విజయాన్ని అందుకుంది. ఏఎన్నార్ – సావిత్రి కెరియర్లో చెప్పుకోదగిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఆదుర్తికి కథ .. స్క్రీన్ ప్లే పై ఉన్న పట్టు, సాంఘిక చిత్రాలలో ఏయే అంశాలు ఏ పాళ్లలో ఉండాలనేది బాగా తెలుసనే విషయం ఏఎన్నార్ కి అర్థమైపోయింది. అందుకే ఆయన ఇక ఆదుర్తిని వదిలిపెట్టలేదు. ఇక అప్పటి నుంచి వారి ప్రయాణం కొనసాగింది.

Adurthi Films

ఆదుర్తి తీసిన అత్యధిక చిత్రాలలో కథానాయకుడు ఏఎన్నారే. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన మూగమనసులు .. డాక్టర్ చక్రవర్తి .. మాంగల్యబలం .. వెలుగు నీడలు .. పూలరంగడు .. సుమంగళి .. తదితర సినిమాలు ఘన విజయాలను నమోదు చేశాయి. వాస్తవానికి దగ్గరగా ఉండే కథలు .. సహజత్వానికి దగ్గరగా అనిపించే సన్నివేశాలు .. మధురమైన పాటలకు ఆయన సినిమాలు ఆనవాలుగా మారాయి. ఒక రకంగా చెప్పాలంటే సాంఘిక చిత్రాలలో ఎదురులేని కథానాయకుడిగా ఏఎన్నార్ ని ఈ సినిమాలు నిలబెట్టాయి.

Adurthi Films

ఇక టైటిల్ విషయంలో ఆదుర్తి సెంటిమెంట్ ను పాటించిన విషయం మనకి స్పష్టంగా తెలుస్తుంది. మంచి మనసులు .. మూగమనసులు .. కన్నె మనసులు .. తేనె మనసులు అందుకు ఉదాహరణగా కనిపిస్తాయి. ఇక అందరూ కొత్తవాళ్లతో సినిమా చేయడమనేది ఇప్పుడు ఒక ప్రయోగంగా .. సాహసంగా దర్శకులు భావిస్తున్నారు. కానీ అప్పట్లోనే ఆదుర్తి నూతన నటీనటులతో ‘తేనె మనసులు’ చేశారు. ఈ సినిమాతోనే కృష్ణ తెలుగు తెరకి పరిచయం కావడం, ఆ తరువాత కాలంలో సూపర్ స్టార్ అనిపించుకోవడం జరిగిపోయాయి.

ఆదుర్తి ఆలోచనలతో కాలం గడిపేసే రకం కాదు. తాను అనుకున్నది సాధ్యమైనంత త్వరగా ఆచరణలో పెట్టేసే స్వభావం ఆయనది. ఏదైతే అనుకున్నారో అది చేసేవరకూ పట్టువదిలేవారు కాదు. అప్పట్లో స్టూడియోల్లోనే సినిమాలు చేసేవారు. అలాంటి పరిస్థితుల్లో మూగమనసులు సినిమాను అవుట్ డోర్ లో తీసినవారాయన. ఇలా ఒక వైపున తెలుగు సినిమాలు చేస్తూనే ఆయన ‘మిలాన్’ సినిమాతో బాలీవుడ్ కి పరిచయమయ్యారు. సునీల్ దత్ .. రాజేశ్ ఖన్నా .. వినోద్ ఖన్నా .. ధర్మేంద్ర వంటి హీరోలతో హిట్లు కొట్టిన ప్రతిభావంతుడు ఆయన. తెలుగు సినిమాపై తనదైన ముద్రవేసిన ఆదుర్తి జయంతి నేడు .. ఈ సందర్భంగా మనసారా ఒకసారి ఆయనను స్మరించుకుందాం.

(ఆదుర్తి సుబ్బారావు జయంతి ప్రత్యేకం)

— పెద్దింటి గోపీకృష్ణ

Also Read : భోగాల మధ్య యోగి… రజనీకాంత్

RELATED ARTICLES

Most Popular

న్యూస్