Saturday, November 23, 2024
HomeTrending Newsనోటిఫికేషన్ తర్వాత తిరుగుబాటు ఉధృతం: బాబు

నోటిఫికేషన్ తర్వాత తిరుగుబాటు ఉధృతం: బాబు

ప్రజలు, సొంతపార్టీ నేతల తిరుగుబాటుతో వైఎస్ జగన్ కు భంగపాటు తప్పదని, నూటికి నూరుశాతం రాష్ట్రంలో రాబోయేది టిడిపి-జనసేన ప్రభుత్వమేనని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. నోటిఫికేషన్ వచ్చిన తరువాత ప్రజల తిరుగుబాటు ఉధృతమవుతుందని పేర్కొన్నారు. వైసీపీ మాజీ నేత, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నేడు తెలుగుదేశం పార్టీలో చేరారు. నెల్లూరు వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన కార్యక్రమంలో పార్టీ కండువా కప్పి సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ… రాష్ట్రం అంటే మట్టి కాదని, మనుషులని ..రాష్ట్రంకోసం ప్రజల భవిష్యత్తు కోసం, పుట్టబోయే బిడ్డల కోసం, రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసిన జగన్ ను ఇంటికి పంపాల్సిన అవసరం ఉందని అన్నారు.

వైజాగ్ ను దోచుకున్న వ్యక్తిని ఇప్పుడు నెల్లూరు ఎంపి అభ్యర్ధిగా పంపుతున్నారని, ఆయన్ను తిరుగుటపాలో ఇక్కడి ప్రజలు తిప్పి పంపడం ఖాయమని విజయసాయిరెడ్డిని ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు. మొన్నటిదాకా మంత్రిగా పని చేసిన ఓ వ్యక్తి ఇష్టానుసారం మాట్లాడారని, బుల్లెట్ దిగిందా లేదా అంటూ డైలాగులు చెబుతారని, సీట్ల మార్పులో  ఓ తన్ను తంతే పల్నాడు వెళ్ళాడని, అక్కడ ఈ నేతకు బుల్లెట్ దింపడానికి పల్నాడు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అనిల్ పై పరోక్షంగా మండిపడ్డారు.

వేమిరెడ్డి అజాత శత్రువు అని అలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండడం రాష్ట్రానికే ఎంతో అవసరమని… అందుకే ఆయన్ను పార్టీలో చేర్చుకునేందుకు తానే నెల్లూరు వచ్చానని… అదే వేమిరెడ్డికి ఉన్న ప్రత్యేకత అన్నారు. రాష్టంలో నెల్లూరు రాజకీయాలకు ఓ ప్రత్యేకత ఉందని, ఎన్నో తరాలనుంచి రాజకీయాల్లో కొనసాగుతున్న కుటుంబాలు ఉన్నాయని… సిఎం జగన్ వారిని కూడా ఎన్నో ఇబ్బందులకు గురిచేశారని దుయ్యబట్టారు. జగన్ సిద్ధం సిద్ధం అంటున్నారని కానీ ఆయన్ను ఇంటికి పంపడానికి ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారని బాబు చెప్పారు.  రాష్ట్రం ఇప్పటికే 30 ఏళ్ళు వెనక్కు వెళ్లిందని, జగన్ లాంటి వ్యక్తులు మళ్ళీ అధికారంలోకి వస్తే ఎవరికీ రక్షణ ఉండదని హెచ్చరించారు.

దేవుడి ఆశీస్సులు, తన కృషితో పరిధి మేరకు సేవ చేస్తుంటానని, ఎక్కువమందికి సేవ చేయాలంటే రాజకీయాలే వేదిక అని చాలా మంది తన సన్నిహితులు చెప్పారని అందుకే రాజకీయాల్లోకి వచ్చానని… టిడిపిలో తాను చేరడం దైవ నిర్ణయమని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్