తెలంగాణలో వేరుశనగ సాగు విస్తృతికి అవకాశాలున్నాయని, గుజరాత్ తో పోల్చుకుంటే తెలంగాణ వేరుశనగ విత్తన నాణ్యత ఎక్కువని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. గుజరాత్ లో అక్టోబర్ నుండి చలి తీవ్రత మూలంగా వర్షాకాలంలోనే వేరుశెనగ సాగుకు అవకాశం .. దీనిమూలంగా ఎంత వేరుశనగ దిగుబడి సాధించినా అఫ్లాటాక్సిన్ ఫంగస్ రహిత (శిలీంధ్రం) వేరుశనగ దిగుబడి అసాధ్యం అన్నారు. తెలంగాణలో యాసంగిలో వేరుశనగ సాగునకు సంపూర్ణ అవకాశాలు .. అక్టోబర్ లో వేరుశనగ విత్తుకుంటే జనవరి చివరివారం, ఫిబ్రవరి మొదటివారంలోపు ఊష్ణోగ్రతలు 30 డిగ్రీలు దాటకుండానే పంట చేతికి వస్తుంది. దేశంలో యాసంగిలో వేరుశనగ సాగుకు అనుకూల పరిస్థితులు ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు.
గుజరాత్ పర్యటనలో భాగంగా మోర్బీ జిల్లా అలువద్ తాలూకా సుఖ్ పూర్ గ్రామ రైతులు అజీద్ భాయ్, జుగ్మాల్ భాయ్ ల వేరుశనగ క్షేత్రాన్ని, మోర్బీ సమీపంలో బోన్ విల్లే ఫుడ్స్ లిమిటెడ్ సందర్శించి వేరుశనగ ఆధారిత ఉత్పత్తులను పరిశీలించిన వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి , రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ ఎండీ కేశవులు, గుజరాత్ జేడీహెచ్ (జాయింట్ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్) చావ్డా.
ఆఫ్లాటాక్సిన్ రహిత వేరుశనగ తెలంగాణకు ప్రయోజనకారి .. ఆఫ్లాటాక్సిన్ రహిత వేరుశనగకు అంతర్జాతీయంగా ఆదరణ ఉందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. వేరుశనగ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనతో విస్తృతంగా ఉపాధి, వ్యాపార అవకాశాలు ఉన్నాయన్నారు. గుజరాత్ లో ఖరీఫ్ దాదాపు 54 లక్షల ఎకరాలలో వేరుశనగ సాగు, మరో 56 లక్షల ఎకరాలలో పత్తి సాగు జరుగుతోందని, గుజరాత్ మొత్తాన్ని వాతావరణ, వర్షపాత పరిస్థితుల ప్రకారం 8 జోన్లుగా విభజించిన వ్యవసాయ శాఖ. వాతావరణం, వర్షాపాతాన్ని బట్టి పంటలసాగుకు రైతులకు ప్రణాళిక.
ఖరీఫ్ లో వేరుశనగ, పత్తి ప్రధానపంటలతో పాటు పప్పుధాన్యాలు , ఆముదం , భాజ్రా పంటలు , రబీలో గోధుమ, ఆలుగడ్డ (బంగాళదుంప), ఆవాలు, భాజ్రా పంటలు. మొత్తం గుజరాత్ లో 2.42 కోట్ల ఎకరాల సాగుభూమి, కోటీ 19 లక్షల ఎకరాలకు సాగునీటి సదుపాయం. తెలంగాణలో పెరిగిన సాగునీటి వసతుల నేపథ్యంలో స్పష్టమయిన ప్రణాళికతో రైతులను సాంప్రదాయ పంటల నుండి బయటకు తీసుకురావాలి. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుతో తెలంగాణ దశ మారిపోతుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. డిమాండ్ ఉన్న పంటల సాగును ప్రోత్సహించడంతో పాటు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లతో వ్యవసాయరంగ స్వరూపాన్ని సమూలంగా మార్చివేయాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అన్నారు.
వరి సాగు నుండి తెలంగాణ రైతాంగం బయటకు రావాలి
వరి కన్నా తక్కువ ఖర్చు, తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు ఇచ్చే వాణిజ్యపంటలను సాగు చేయాలని, రైతుబంధు, రైతుభీమా, 24 గంటల ఉచితకరంటుతో తెలంగాణ రైతాంగం ఆత్మవిశ్వాసంతో ఉందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చెప్పారు.