Wednesday, October 4, 2023
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంభారతీయ విమానాశ్రయ 'ఆధిపత్యం'

భారతీయ విమానాశ్రయ ‘ఆధిపత్యం’

Language speaks…:

ప్రభుత్వ బోర్డు భాష :-

తిరుపతి వెళ్లిన ప్రతిసారీ విమానాశ్రయం ప్రహరీ గోడ మొదటి మెయిన్ గేటు దగ్గర నాకు అనువాద భాషకు సంబంధించి విచిత్రమయిన పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. ప్రతిసారీ ఈ సమస్య ఎవరికి చెప్పాలో తెలియక…బాధపడి వదిలేస్తూ ఉంటాను.

తెలుగులో-
భారతీయ విమానాశ్రయ ఆధిపత్యం- తిరుపతి విమానాశ్రయంకు స్వాగతం

హిందీలో-
భారతీయ విమాన్ పత్తన్ ప్రాధికరణ్- తిరుపతి హవాయి అడ్డా ఆప్ కా స్వాగత్ కర్తా హై

ఇంగ్లిష్ లో –
Airports Authority of India- Tirupati Airport welcomes you

అని కళ్లు మూసుకున్నా కనిపించేంత పెద్ద పెద్ద అక్షరాలతో బోర్డు కనిపిస్తుంది. ఎయిర్ పోర్ట్ అథారిటీ అన్న ఇంగ్లీషు మాటకు “భారతీయ విమానాశ్రయ ప్రాధికార సంస్థ” అని అనువాదం ఉండాలి. ఆధిపత్యం అంటే ఇంగ్లీషులో dominance. ఇంగ్లీషులో ఇండియన్ ఎయిర్ పోర్ట్స్ డామినెన్స్ అని ఉండి ఉంటే…అప్పుడు భారతీయ విమానాశ్రయ ఆధిపత్యం అన్నది సరయిన అనువాదమే అయి ఉండేది.

హవాయి అడ్డా అప్ కా స్వాగత్ కర్తా హై;
ఎయిర్ పోర్ట్ వెల్కమ్స్ యు
అని హిందీ ఇంగ్లీషులో సరిగ్గానే ఉన్నా తెలుగులో విమానాశ్రయంకు స్వాగతమట. విమానాశ్రయానికి స్వాగతం అని ఉండాలి.

బహుశా విమానాశ్రయ సంస్థ బోర్డులు రాసే పనిని ఎవరికో కాంట్రాక్ట్ ఇచ్చి ఉంటుంది. యాడ్ ఏజెన్సీలు మొదట ఇంగ్లీషులో రాసి తరువాత హిందీలో ఆపై మిగతా భారతీయ భాషల్లోకి యాంత్రికంగా అనువాదం చేస్తున్నట్లు కఠోరమయిన ఇనుప గుగ్గిళ్ల భాష తిరుపతి విమానాశ్రయం బోర్డుకు కూడా చేరినట్లు ఉంది.

తిరుపతి ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రం. సనాతన వైష్ణవ సంప్రదాయానికి, ఆచారాలకు, భాషా సంస్కృతులకు పెట్టింది పేరు. జాతీయ సంస్కృత విశ్వ విద్యాలయం తిరుపతిలో ఉంది. ఎస్ వీ యూనివర్సిటీ ఉంది. పద్మావతీ మహిళా విశ్వ విద్యాలయం ఉంది. కొద్ది దూరంలో కుప్పం ద్రవిడ విశ్వ విద్యాలయం ఉంది.

అన్నమయ్య, తరిగొండ వెంగమాంబ, వేటూరి ప్రభాకర శాస్త్రి సాహిత్య పరిశోధన పీఠాలున్నాయి. అవధానులున్నారు. వ్యాకరణవేత్తలున్నారు. భాషా శాస్త్ర నిపుణులున్నారు. సాహిత్యం చదివిన తిరుపతి ఎం ఎల్ ఏ భూమన కరుణాకర్ రెడ్డిటి టి డి చైర్మన్ గా ఉన్నారు. వీరందరినీ ఈ బోర్డు ఎగతాళి చేస్తున్నట్లుగా ఎన్నేళ్లుగా ఉందో?

నిజంగానే మిగతా విమానాశ్రయాల కంటే తిరుపతిది “ఆధిపత్యమే” అయి ఉంటే…భక్తుల అహంకారం అణచడానికి అలా ప్రతీకాత్మకంగా పెట్టి ఉంటారనుకోవాలేమో!

ఆ మాటకొస్తే తిరుపతే కాదు…ప్రపంచంలో ఏ విమానాశ్రయం బోర్డు మీద అయినా “ఆధిపత్యం” అని రాయడమే సముచితం. ఎందుకంటే…మనం మన డబ్బుతో టికెట్టు కొని విమానాశ్రయానికి వెళ్లినా…ఆ మనం మనమేనని మానావమానాలు మరచి ఫోటో గుర్తింపు కార్డు చూపాలి. ప్యాంటు జారిపోయి నలుగురి ముందు నవ్వులపాలైనా బెల్ట్ తీసి స్కానర్ కన్వేయర్ బెల్ట్ లో పెట్టాలి. ఫోన్, పర్స్, బూట్లు విప్పి యోగివేమనలా బాడీ స్కానింగ్ కు చేతులు కాళ్ళెత్తి నిలుచోవాలి. పోలీసు పహరా కుక్కలు, వేట కుక్కలు, వాసన పసిగట్టే కుక్కల మధ్య దొంగల్లా భయం భయంగా బిక్కు బిక్కుమంటూ విమానం ఎక్కాలి.

ప్రతి దశలో ప్రయాణికుడిగా మన ఆధిపత్యం ఏమీ ఉండదని తెలియజేస్తూనే ఉంటారు. అందువల్ల “విమానాశ్రయ ఆధిపత్యం” అన్న మాటనే ఖరారు చేసి ఇంగ్లీషులో దాని అనువాదమయిన “ఎయిర్ పోర్ట్స్ డామినెన్స్” అని దేశంలో మిగతా అన్ని చోట్ల కూడా రాయించడమే మంచిదేమో!

జనం భాష:-
ప్రభుత్వ బోర్డుల్లో ఇనుప గుగ్గిళ్లను కాసేపు పక్కనపెట్టి జనం భాషను విందాం. హైదరాబాద్ నుండి తిరుపతి వెళ్లే విమానంలో నా వెనుక సీట్లో భార్యా భర్త కూర్చున్నారు. ఆమె ఒడిలో రెండేళ్లలోపు మాటలు నేర్చుకుంటున్న అమ్మాయి. విమానం టేకాఫ్ కు ముందు నుండి విమానం దిగే వరకు ఆ తల్లి ఆ కూతురికి మంచి తెలంగాణ మాండలికంలో ప్రతి దృశ్యాన్నీ చెబుతోంది. నాకు చెవుల్లో అమృతం పోసినట్లు ఉంది.

“ఇగో చూడు.. పక్షి లెక్క మబ్బుల్లో ఎగురుతున్నం. పత్తి కొండలెక్క మబ్బులు చూడు ఎట్లున్నయో! అగో కిటికీల సూర్యుడు చూడు మన వెంటే వస్తున్నడు. ఇగో దిగేసినం. తిరుపతి వచ్చేసినం…”

పత్తిపాడు, పత్తికొండ ఊళ్ళ పేర్లు విన్నాను కానీ…ఇలా దట్టంగా పరుచుకున్న మబ్బుల గుంపును పత్తికొండ అని తొలిసారి విన్నా. మాతృ భాష అంటే అమ్మ భాష. అమ్మ చెప్పేదే ప్రపంచంలో మొదటి భాష అని ఆ తల్లి మాటలు వింటున్నప్పుడు అనిపించింది. అమ్మ సృష్టించిన భాషను అందుకోగల భాషాశాస్త్రం ఉంటుందా?

వచ్చేప్పుడు నా ముందు సీట్లో ఒక రాయలసీమ ఆయన ఎవరికో ఫోన్ చేసి…
ఒక్క రవ్వ…వాళ్లందరికి నువ్వే ఫోన్ చేసి చెప్పబ్బా…విమానమిప్పుడు గాల్లోకి లేస్తోంది. ఆమాయన మాట్లాడితే ఆమొచ్చి తిడుతుంది…

టేకాఫ్ మాటకు గాల్లోకి లేవడం అని అద్భుతమయిన తెలుగు. ఎయిర్ హోస్టెస్ ను గగనసఖి అని మీడియా అనువదించింది. జనం సింపుల్ గా ‘ఆమె’ అంటున్నారు. అత్యంత సరళంగా, సహజంగా రోజువారీ వాడుక మాటలను జనమే సృష్టించుకుంటారు. జనం భాషను నిర్వచించడానికి వ్యాకరణ గ్రంథాల శక్తి చాలదేమో అని నా వ్యక్తిగత అభిప్రాయం.

జన భాషాధిపత్యం ముందు ప్రభుత్వ కృతక భాషాధిపత్యం చిన్నబోవాల్సిందే.

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

Pamidikalva Madhusudan
Pamidikalva Madhusudan
తెలుగు, జర్నలిజం, సైకాలజీల్లో పోస్టుగ్రాడ్యుయేషన్లు. ప్రింట్, టీవీ మీడియాల్లో ఇరవై ఏళ్ల పాటు జర్నలిస్టుగా అనుభవం. 15 ఏళ్లుగా మీడియా వ్యాపారం. వివిధ పత్రికలు, మ్యాగజైన్లు, వెబ్ సైట్లలో కాలమిస్టుగా పాతికేళ్ళ అనుభవం.
RELATED ARTICLES

2 COMMENTS

  1. అందరూ ప్రయాణాలు చేస్తారు, 99.99% మంది దారిలో ఉన్న Signboards ని కేవలం Information కొరకే చూస్తారు (చదువుతారు). మీలాంటి (వేలల్లో ఒకరు) వారు మాత్రమే, Advertisements boards, Signboards లాంటి వాటిపైన ఉండే అక్షరాల్లో ఔచిత్య పరీక్ష దృష్టిలో విశ్లేషిస్తారు.
    అప్పుడప్పుడూ నేను కూడా ఇలా ఔచిత్య పరీక్ష చేస్తూ ఉంటాను కానీ అక్షరరూపం చేసి పది మందికి పంచుకోవడం చాలా అరుదు.
    వ్యాసం లో మీరు ఉటంకించిన పెద్దల దృష్టిలో మన లాంటి సగటు సాహిత్యాభిలాషి ఆవేదన నమోదయ్యి, తొందరలో తప్పు సరి చేస్తారని ఆశిద్దాం.

  2. ఓ జర్నలిస్ట్ గా పత్రికల్లో ఎడిట్ పేజీ ఆర్టికల్స్ చదవడం అలవాటు. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలపై తెలుగేతర నిపుణులు రాసే ఆర్టికల్స్ ను తెలుగులోకి అనువదించి ప్రచురిస్తుంటారు. వాటిల్లోని భాష చాలా డొంకతిరుగుడుగా ఉంటోంది. అనువాదం చేసే క్రమంలో వాక్యంలోని భావాన్ని పాఠకుడికి సరిగ్గా అర్థమయ్యేలా రాస్తే చదవడానికి సులువుగా, అర్థం చేసుకోవాలనికి వీలుగా ఉంటుంది. కానీ దానికి బదులుగా గుగుల్ ట్రాన్స్ లేషన్ చేస్తున్నారా అనే అనుమానం కలుగుతుంది. కొన్ని తెలుగు వాక్యాలను నాలుగైదు సార్లు చదివితే కానీ రచయిత ఉద్దేశం అర్థం కాదు. ప్రజల భాషను, ప్రామాణిక భాషను అనుసరించే పత్రికల్లోనే ఇటువంటి అనువాదపు అవస్థలు తెలుగు పాఠకులను ఇబ్బంది పెడుతున్నాయి. దీనిని అనుభవజ్ఞులు కూడా పట్టించుకోవడం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Ramaraju on జనం భాష
Ramaraju on జనం భాష
Radhakrishna Regalla on లోహం- వ్యామోహం
ఆకతాఈ శ్రీ on తెలుగు వెలుగు
Indrasen Bejjarapu on మనసున్న పులి
ఎమ్వీ రామిరెడ్డి on మనసున్న పులి
ఫణీన్ద్ర పురాణపణ్డ on హంపీ వైభవం-1
Radhakrishna Regalla on హంపీ వైభవం-2
Radhakrishna Regalla on హంపీ వైభవం-2
Dr MVJM RAMA PRASAD MANDA on హంపీ వైభవం-2
Radhakrishna Regalla on హంపీ వైభవం-1
తనికెళ్ల శ్రీనివాస్ on రెండు వ్రాతప్రతులూ అపూర్వమే !
కర్రా వెంకటరత్నం on మా నాన్న