ఆకాశ్ హీరోగా రూపొందిన ‘చోర్ బజార్‘ నిన్ననే థియేటర్లకు వచ్చింది. వీఎస్ రాజు నిర్మించిన ఈ సినిమాకి జీవన్ రెడ్డి దర్శకత్వం వహించాడు. గతంలో ఆయన నుంచి వచ్చిన ‘జార్జి రెడ్డి’ మంచి మార్కులను సంపాదించుకుంది. అందువలన ఈ సినిమాకి వెళ్లడానికి ఆసక్తిని చూపించడంలో తప్పులేదు. పైగా ఇంతవరకూ లవర్ బోయ్ పాత్రలను మాత్రమే చేస్తూ వచ్చిన ఆకాశ్, మాస్ హీరోగా మార్కులు సంపాదించుకోవడానికి ఈ సినిమాతోనే ఉత్సాహపడ్డాడు. ఈ సినిమాతో గెహనా సిప్పీ హీరోయిన్ గా పరిచయమైతే, సీనియర్ నటి అర్చన పాతికేళ్ల తరువాత రీ ఎంట్రీ ఇవ్వడం విశేషం.
ఈ వారం చిన్న సినిమాలు చాలానే రిలీజ్ అయ్యాయి. వాటిలో ఆకాశ్ సినిమా కాస్త మెరుగ్గా ఉండే అవకాశం ఉందని అనుకోవడం సహజం. అలా అనుకుని థియేటర్ కి వెళ్లినవారికి, ఈ కథనేనా వినగానే ఒప్పేసుకున్నానని ఆకాశ్ ఇన్ని ఇంటర్వ్యూలలో చెప్పింది అనిపిస్తుంది. ఇది 200 కోట్ల విలువైన డైమండ్ చుట్టూ తిరిగే కథ. దాని కోసం ఇటు దొంగలు .. అటు పోలీసులు చేసే ప్రయత్నాలు .. మధ్యలో ఒక ప్రేమకథ అంతే. ఇలాంటి కథలు గతంలో చాలానే వచ్చాయి. ఈ కథలో కొత్తగా ఏం చెప్పారని వెళితే, స్క్రీన్ పై ఏ మూల వెతికినా మీకు ఏమీ దొరకదు.
దర్శకుడు ఈ కథను సీరియస్ గా చెప్పాలనుకున్నాడా? లేదంటే కామెడీగా విప్పాలనుకున్నాడా? అనేది అర్థం కాదు. కథలో సీరియస్ నెస్ లేదు కనుక .. ఆయన ఉద్దేశంతో కామెడీగా చెబుదామనే కావొచ్చు .. కానీ ఎక్కడైనా ఒకచోట నవ్వొస్తే ఒట్టు. ఆకాశ్ యాక్షన్ ఓకే .. కానీ ఏం ప్రయోజనం? కథపై కసరత్తు లేకుండా చేసిన సాము ఇది. డైమండ్ ఎక్కడెక్కడ తిరుగుతుందనే థ్రిల్ ఉండదు .. హీరో హీరోయిన్ లవ్ లో ఫీల్ కనిపించదు. ఇన్నేళ్ల తరువాత అర్చన ఈ పాత్రను ఎందుకు ఒప్పుకుందన్నది అర్థం కాదు. అవసరం లేని సీన్స్ .. అనవసరమైన పాత్రలు చాలానే కనిపిస్త్తాయి. ఈ కథను పూరి వినకుండానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ప్రమోషన్స్ లో దర్శకుడు చెప్పాడు. కానీ పూరి ఈ కథను వింటే బాగుండేదేమో అని మాత్రం అనిపించకమానదు.
Also Read : అందుకే ‘చోర్ బజార్’ ఒప్పుకున్నాను: నటి అర్చన