Saturday, January 18, 2025
Homeసినిమా'అఖండ 2' పట్టాలపైకి వెళ్లే సమయం ఖరారైనట్టే!

‘అఖండ 2’ పట్టాలపైకి వెళ్లే సమయం ఖరారైనట్టే!

బాలకృష్ణ తన కెరియర్లో ఎప్పుడూ ఎక్కడా గ్యాప్ రానీయలేదు. మొదటి నుంచి ఇప్పటి వరకూ అదే ఉత్సాహంతో వరుస సినిమాలు చేస్తూ వచ్చారు. ఆయన కెరియర్లో ప్రత్యేకమైన స్థానంలో నిలిచే సినిమాల్లో ‘అఖండ’ ఒకటిగా కనిపిస్తుంది. అంతవరకూ బాలకృష్ణ చాలా మాస్ యాక్షన్ సినిమాలు చేస్తూ వచ్చారు. కానీ ఈ సినిమాలో ఆ యాక్షన్ కి దైవత్వం తోడైంది. అందువలన అది ఫ్యామిలీ సినిమాగా మారిపోయింది. ఫలితంగా రికార్డుస్థాయి వసూళ్లను రాబట్టింది.

ఈ  సినిమాకి సీక్వెల్ ఉంటుందని సక్సెస్ మీట్ లోనే బోయపాటి చెప్పాడు. బాలకృష్ణ కూడా సీక్వెల్ గురించి ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అని అంతా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా బాలయ్య అభిమానులు ఆ తీపి కబురు కోసం వేయికళ్లతో వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కే సమయం ఎంతో దూరంలో లేదనేది తాజా సమాచారం. ఈ దసరాకి ఈ సినిమా షూటింగు లాంఛనంగా మొదలుకానుందని అంటున్నారు.

ఒక వైపున డైలాగ్స్ రెడీ అవుతుండగా .. మరో వైపున మిగతా పనులను మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. దసరా తరువాత నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని చెబుతున్నారు. దేశంలోని ప్రసిద్ధమైన శైవాలయాలను టచ్ చేస్తూ ఈ కథ నడుస్తుందని అంటున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణతో తలపడే ప్రతినాయక పాత్ర కోసం సంజయ్ దత్ ను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి దసరా నుంచి ‘అఖండ 2’ సందడి మొదలవుతుందన్న మాట.

RELATED ARTICLES

Most Popular

న్యూస్