గత ఎన్నికల్లో వివేకా హత్య కేసు, కోడి కత్తి డ్రామాలు ఆడిన వైఎస్ జగన్ ఈ ఎన్నికల్లో గులకరాయి డ్రామాకు తెరతీశారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు విమర్శించారు. తమ మీద వేసిన రాళ్ళు దొరికాయి కానీ, ఈ డ్రామా రాయుడిపై వేసిన రాయి దొరకలేదంటూ జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సానుభూతి రాజకీయాలు ఎల్లకాలం పనిచేయవన్నారు. శ్రీరాముడు రావణున్ని వధించినట్లు రాష్ట్ర ప్రజలు కూడా ఈ ఎన్నికల్లో జగనాసుర వధ చేయాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విధ్వంసం, అహంకారంతో రాష్ట్రాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. కృష్ణాజిల్లా పెడనలో జన సేన అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రజాగళం బహిరంగసభలో పాల్గొని ప్రసంగించారు.
మద్యం, ఇసుక, భూ దండాలతో అక్రమంగా సంపాదించిన సొమ్ముతో ఓట్లు కొనుగోలు చేసి మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తున్నారని.. జగన్ కు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపు ఇచ్చారు. ఈ ఎన్నికల్లో గెలవాల్సింది ప్రజలని… అభివృద్ధి, సంక్షేమం, ప్రజాస్వామ్యం పరిరక్షణ తమ కూటమి ప్రధాన అజెండా అని స్పష్టం చేశారు. పొత్తులో భాగంగా మూడు పార్టీల్లో ప్రతి ఒక్కరం తగ్గామని, ప్రజల కోసమే తగ్గాల్సి వచ్చిందన్నారు. సంపద సృష్టిస్తేనే ఆదాయం పెరుగుతుందని, అప్పుడే అభివృద్ధి సాధ్యపడుతుందని అన్నారు. ఇక జగన్ పని అయిపోయిందని, ఇప్పటివరకూ వచ్చిన సర్వేలన్నీ తమకే అనుకూలంగా ఉన్నాయని. కూటమి గెలుపును ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. శవాలతోనే జగన్ ఎన్నికలకు వస్తున్నారంటూ పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు.
జగన్ చాలా బాధపడిపోతున్నారని.. తనపై చాలా కోపంగా ఉన్నారని దీనికి కారణం ఆయన ఓడిపోతున్న సంగతి అర్ధమైందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని తెలిసిపోయిందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. తాము రాగానే… యువతను, మహిళలను, ప్రక్రుతి సంపదను దోచుకున్న ఎమ్మెల్యేలు అప్పటికి మాజీలు అవుతారని వారందరిక్ర్ర్ శిక్షలు పడేలా చేస్తామని హెచ్చరించారు. క్లాస్ వార్ అంటూ మాట్లాడే సిఎం జగన్ ఐదేళ్లుగా పేద ప్రజల పొట్ట కొట్టి దోచుకున్నారని, కరెంటు బిల్లులు ఎన్నిసార్లు పెంచారో ఆలోచించుకోవాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో మత్స్య సంపద పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, తీర ప్రాంతాల్లో జెట్టీలు నిర్మించి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు తమకు అండగా ఉంటున్నారని ఇది ఇప్పటికే తేలిందని… జగన్ కు భయం కలిగేలా భారీ మెజార్టీ ఇవ్వాలని కోరారు.