బ్రేక్ ఫాస్ట్ – లంచ్ కు మధ్య తిన్నది అరగటానికి చేసినట్టుగా చంద్రబాబు చేసే దొంగ దీక్షలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం శ్రీ ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్(నాని) తీవ్రంగా విమర్శించారు. దీక్షలు అంటే ఎలా చేయాలో జగన్ మోహన్ రెడ్డిని చూసి చంద్రబాబు నేర్చుకోవాలని హితవు చెప్పారు. సహజంగా దీక్షలు చేస్తే ఎవరికైనా షుగర్ లెవల్స్ తగ్గుతాయి అని.. షుగర్ లెవల్స్ పెరిగే విధంగా దీక్షలు చేయడం ఒక్క చంద్రబాబుకే చెల్లింది అని విమర్శించారు.
అధికారంలో ఉన్నప్పుడు.. నవ నిర్మాణ దీక్షల పేరుతో రాష్ట్రాన్ని అధోగతిపాలు చేయడమే కాక.. లక్షల కోట్ల అవినీతికి పాల్పడింది చంద్రబాబే అని మండిపడ్డారు. కోవిడ్ తో ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు.. ప్రాణ భయంతో చంద్రబాబు హైదరాబాద్ పారిపోయి, తన రాజ ప్రాసాదంలో జూమ్ కాన్ఫరెన్సుల్లో కాలక్షేపం చేస్తూ.. మేధావులతో, వైద్యులతో మాట్లాడానని గొప్పలు చెప్పుకుంటున్నారని ఆళ్ళ నాని ధ్వజమెత్తారు.
తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో నాని మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్ పారాసెట్మాల్ వాడమన్నారంటూ పదే పదే హేళనగా మాట్లాడుతున్నారని, ఐసీఎంఆర్ మెడిసిన్ ప్రొటోకాల్ లో పారాసెట్మాల్ ట్యాబ్లెట్ ఉన్నదన్న కనీస ఇంగిత జ్ఞానం లేకుండా చంద్రబాబుకు లేదని తూర్పారబట్టారు. సాధన దీక్ష పేరుతో ముఖ్యమంత్రి మీద అక్కసు వెళ్ళగక్కడం తప్ప చంద్రబాబు సాధించిందేమిటి అని ప్రశ్నించారు.
కోవిడ్ సమయంలో మే నెలలో లక్షల్లో ప్రజలు ఎందుకు చనిపోలేదని చంద్రబాబు బాధపడుతున్నట్లు ఉన్నారని, ఎంతసేపటికీ శవాలను అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయడం ఇకనైనా మానాలని ఆళ్ళ నాని హితవు పలికారు. విపత్కర పరిస్థితుల్లో, సంక్షోభాలు వచ్చినప్పుడు ప్రజలను ఎలా రక్షించుకోవాలో చంద్రబాబు నాయుడు లాంటి ప్రజాకంఠకునితో చెప్పించుకోవాల్సిన పని లేదని అన్నారు. ప్రతీ కరోనా సమీక్షలో తాను కుడా ముఖ్యమంత్రి గారితో కలిసి పాల్గొన్నానని.. “సీఎం గారు జీసెస్ తో మాట్లాడతానని, కరోనా గురించి జీసెస్ చెప్పారని..” ఎక్కడ చెప్పారో, ఎవరికి చెప్పారో.. ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నాఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చెప్పాలని అన్నారు. రాధాకృష్ణ ప్రతిరోజూ రాత్రి దయ్యాలు, భూతాలు, రాక్షస మనస్తత్వం ఉన్న చంద్రబాబుతో చర్చిస్తుంటుంటాడేమోనని.. ఆ ప్రభావంతోనే ఇటువంటి పిచ్చి రాతలు రాసి ఉండవచ్చు అని ఆళ్ళ నాని అనుమానం వ్యక్తం చేశారు. 15 నెలల క్రితం సీఎం గారు మాట్లాడినట్టు చెత్త పలుకు పేరుతో రాతలు రాసిన రాధాకృష్ణ.. అదే నిజమైతే ఇంతకాలం ఎందుకు ఆగుతారని ప్రశ్నించారు. రాధాకృష్ణ రాతలు అత్యంత జుగుప్సాకరంగా.. ప్రజలు అసహ్యించుకునే విధంగా ఉన్నాయన్నారు.