ఏలూరు కార్పొరేషన్ లో వైయస్ఆర్సీపీ ఘన విజయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిపాలనకు గీటురాయి అని ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని అభివర్ణించారు. ఎన్ని కష్టాలు వచ్చినా, సమర్థవంతమైన నాయకత్వంతో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా జగన్ పని చేస్తున్నారని కొనియాడారు.
ఇప్పటికైనా చంద్రబాబు కుట్ర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు పునరావృతం అవుతాయన్నారు. అతి త్వరలో టిడిపి భూస్థాపితం కావడం ఖాయమని జోస్యం చెప్పారు.
ఏలూరు మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. మొత్తం 50 డివిజన్లకు గాను 47 కైవసం చేసుకుంది. ఫలితాల అనంతరం నాని మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఏవిధంగా పట్టం కట్టారో, అదే ఒరవడిలో ఏలూరు నగర ప్రజలంతా జగన్ మోహన్ రెడ్డిని ఆశీర్వదించారన్నది ఫలితాలు చూస్తే ఆర్థమవుతుందని వివరించారు.
ఒకవైపు కరోనా విలయతాండవం చేసినా, రాష్ట్ర ఆదాయం కుంటు పడినా, పాదయాత్రలో ఇచ్చిన ఏ ఒక్క హామీని విస్మరించకుండా ఇచ్చిన మాట ప్రకారం ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని, ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చారని నాని తెలిపారు. ఏలూరు నగరానికి సంబంధించిన ఫలితాలను ఆపటానికి చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా, ప్రజా తీర్పును ఎంతోకాలం ఆపలేరన్నది నిరూపితమైన్దన్నారు. జగన్ పట్ల ఉన్న ప్రజల్లో ఉన్న ప్రేమాభిమానాలు ఈ ఎన్నికల ఫలితాల్లో ప్రతిబంబించాయని నాని వ్యాఖ్యానించారు.