‘అల్లరి’ నరేశ్ .. రాజేంద్రప్రసాద్ తరువాత హాస్యకథానాయకుడిగా తన మార్కు సినిమాలను పరిగెత్తించిన హీరో. గట్టిపోటీని తట్టుకుంటూ, చాలా వేగంగా 50 సినిమాలను పూర్తిచేసిన కథానాయకుడు. ఆయన నటించిన సినిమాలు టీవీలలో వస్తే .. ఛానల్ మార్చకుండా చూసేవారు చాలామందినే ఉంటారు. అలాంటి ‘అల్లరి’ నరేశ్ మధ్య మధ్యలో తన ఇమేజ్ కి భిన్నమైన పాత్రలను చేస్తూ వచ్చాడు. వాటిలో ఎమోషన్స్ తో కూడుకున్న పాత్రలు ఎక్కువగా ఉండటం విశేషం.
సాధారణంగా కామెడీతో కూడిన సినిమాలు చేసే హీరోలు .. కన్నీళ్లు పెట్టించే సీన్స్ చేస్తే పెద్దగా పేలవు. ఆడియన్స్ కూడా ఆ తరహా సీన్స్ కి అంతగా కనెక్ట్ కారు. కానీ నరేశ్ తనకి నవ్వించడమే కాదు .. కన్నీళ్లు పెట్టించడం కూడా తెలుసు అనే విషయాన్ని నిరూపిస్తూ కొన్ని పాత్రలు చేశాడు. ఆ పాత్రలను ప్రేక్షకులు రిసీవ్ చేసుకోవడమే కాదు .. ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నారు. అలాంటి పాత్రలోనే ‘నా సామిరంగ’లో ‘అల్లరి’ నరేశ్ పోషించాడు.
ఈ సినిమాలో ఆయన నాగార్జునతో చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన స్నేహితుడిగా కనిపిస్తాడు. ‘అంజి’ పాత్రలో సినిమా చివరివరకూ నాగార్జునతో కలిసి కనిపిస్తాడు. అతనిపై కామెడీ .. ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. పాటల్లోను హుషారుగా స్టెప్స్ వేస్తూ అలరించాడు. ఇక ప్రీ క్లైమాక్స్ లో ‘అల్లరి’ నరేశ్ నటన కన్నీళ్లు పెట్టించేస్తుంది. చాలా కాలం తరువాత నరేశ్ కి మంచి పాత్ర పడిందనే చెప్పాలి. నరేశ్ లోని అసలైన నటుడిని ఈ పాత్ర మరోసారి ఆవిష్కరించిందనే అనాలి.