ఈ శుక్రవారం థియేటర్ల దగ్గర కాస్త గట్టిగానే సందడి కనిపిస్తోంది. ఓ నాలుగైదు సినిమాలు థియేటర్లలో దిగడానికి రెడీ అవుతున్నాయి. ఆ జాబితాలో అల్లరి నరేశ్ హీరోగా చేసిన ‘ఆ ఒక్కటీ అడక్కు’ ముందు వరుసలో కనిపిస్తోంది. కొంత గ్యాప్ తరువాత అల్లరి నరేశ్ చేసిన కామెడీ కంటెంట్ ఇది. ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటించిన ఈ సినిమాకి ‘మల్లి’ దర్శకత్వం వహించాడు. గోపీసుందర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాపై, ఆడియన్స్ లో ఆసక్తి ఉంది. ఇక ఇదే రోజున ‘బాక్’ విడుదలవుతోంది.
సుందర్ సి. దర్శకత్వం వహించిన ‘బాక్’ హారర్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో రూపొందింది. తన సొంత బ్యానర్ పై ఆయన నిర్మించిన ఈ సినిమాలో, తమన్నా – రాశి ఖన్నా ప్రధానమైన పాత్రలను పోషించారు. అస్సాంలో బాగా ప్రాచుర్యంలో ఉన్న ఒక జానపద కథలోని దెయ్యం నేపథ్యంతో ఈ సినిమాను రూపొందించారు. తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఇక సుహాస్ చేసిన ‘ప్రసన్న వదనం’ పై కూడా అంచనాలు బలంగానే ఉన్నాయి. ఫేస్ బ్లైండ్ నెస్ కాన్సెప్ట్ పై ఈ సినిమా నిర్మితమైంది.
ముఖాలను ఏ మాత్రం గుర్తుపట్టలేని వ్యాధితో బాధపడే ఒక యువకుడు, మర్డర్ కేసు నుంచి ఎలా భయటపడ్డాడు అనేదే కథ. అర్జున్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పాయల్ రాధాకృష్ణ – రాశి సింగ్ కథానాయికలుగా కనిపించనున్నారు. ఇక వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధానమైన పాత్రను పోషించిన ‘శబరి’ కూడా ఇదే రోజున విడుదలవుతోంది. మహేంద్రనాథ్ నిర్మించిన ఈ సినిమాకి అనిల్ దర్శకత్వం వహించాడు. మదర్ సెంటిమెంట్ తో నిర్మితమైన ఈ సినిమా, టైటిల్ దగ్గర నుంచే అందరిలో కుతూహలాన్ని పెంచుతూ వచ్చింది. మరి ఈ సినిమాలలో ఏది ఎక్కువగా ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందనేది చూడాలి.