Sunday, September 8, 2024
HomeTrending NewsTelangana Polls: ఆ మంత్రులపై ఒకే తీరు ఆరోపణలు

Telangana Polls: ఆ మంత్రులపై ఒకే తీరు ఆరోపణలు

ఎన్నికల ప్రచారం దగ్గరపడుతున్న కొద్దీ నియోజకవర్గాల్లో సమీకరణాలు మారుతున్నాయి. నామినేషన్ వేసిన రోజు నుంచి  ఈ రోజు(నవంబర్ -23) వరకు ఎన్నికల సరళి పరిశీలిస్తే వివిధ ప్రాంతాల్లో అభ్యర్థుల బలాబలాలు మారుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ముగ్గురు మంత్రులు ఎన్నికల సమరంలో ఎదురీదుతున్నారు. ఇదే ధోరణి కొనసాగితే అభ్యర్థుల తలరాతలు మరే అవకాశం ఉంది. కొన్ని నియోజకవర్గాలను విశ్లేషిస్తే మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.

సూర్యపేట

సూర్యపేటలో మంత్రి జగదీష్ రెడ్డి మూడోసారి గెలుపు కోసం కారుతో జోరుగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, బిజెపి నుంచి సంకినేని వెంకటేశ్వర్ రావు, BSP నుంచి వట్టె జానయ్య పోటీ చేస్తున్నారు. రెండుసార్లు మంత్రిగా పనిచేసిన జగదీష్ రెడ్డి ఈ దఫా కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు BSP అభ్యర్థి వట్టె జానయ్య..మంత్రి ఓటమే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు.

ఒకప్పుడు నియోజకవర్గంలో భువ్యవహారాల్లో జానయ్య చెపితే మంత్రి చెప్పినట్టే అని ఉండేది. ఇద్దరి మధ్య బెడిసి, అనుచరుడిగా ఉన్న జానయ్యపై కేసులు, దాడులు మంత్రికి ప్రతికూలంగా మారాయి. బిఎస్పి అధినేత్రి మాయావతితో పట్టణంలో బహిరంగసభ నిర్వహించారు. దీంతో దళితులు, మైనారిటీల ఓట్లు అధికారపార్టీకి దూరం అయ్యే అవకాశం ఉంది.  సూర్యపేటలో ఏనుగు గుర్తు కారుకు కంట్లో నలుసులా తయారైంది.

నిర్మల్ 

నిర్మల్ లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి ఎదురుగాలి వీస్తోందని వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి శ్రీహరి రావు, బిజెపి నుంచి మహేశ్వర్ రెడ్డి తలపడుతున్నారు. ప్రభుత్వ పథకాలు అనుచరులకే ఇప్పించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల నర్సాపూర్ సభలో ఓ మహిళ ఇదే ప్రశ్నిస్తే…మా ఇష్టం ఉన్న వాళ్లకు ఇస్తామని మంత్రి ఘాటుగా స్పందించటం వైరల్ అవుతోంది. మొదట బిజెపి – బీఆర్ఎస్ ల మధ్య ఉన్న పోటీ ఇప్పుడు బిజెపి – కాంగ్రెస్ ల మధ్య పోటీగా మారుతోంది.  ప్రధానమంత్రి నరేంద్రమోడి ఈ నెల 26న నిర్మల్ వస్తే బిజెపి గెలుపు సుస్థిరం అవుతుందని కమలం శ్రేణులు ధీమాతో ఉన్నాయి.

వేములవాడ

వేములవాడలో బిజెపి వేసిన తప్పటడుగు కాంగ్రెస్ అభ్యర్థికి కలిసి వస్తోంది. కాంగ్రెస్ నుంచి ఆది శ్రీనివాస్, బీఆర్ఎస్ నుంచి చల్మడ లక్ష్మి నరసింహ రావు, బిజెపి నుంచి చెన్నమనేని వికాస్ బరిలో ఉన్నారు. బిజెపి మొదట తుల ఉమ పేరు ప్రకటించి అనూహ్యంగా పార్టీ సీనియర్ నేత విద్యాసాగర్ రావు కుమారుడు వికాస్ రావుకు బీ ఫాం ఇచ్చింది.

దీంతో దొరలకు ఎంతకాలం ఓట్లు వేస్తాం ఈ దఫా బిసి నేత ఆది శ్రీనివాస్ కు వేద్దామనే ప్రచారం ఉదృతంగా సాగుతోంది. బిజెపి తీరుతో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం నానా కష్టాలు పడుతున్నారు. బిసి కార్డు, వరుస ఓటముల సానుబూతి, ప్రత్యర్థులు ఇద్దరు వెలమ సామాజికవర్గానికి చెందిన వారు కావటం ఆది శ్రీనివాస్ కు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

కరీంనగర్ 

కరీంనగర్ లో బీఆర్ఎస్ నుంచి మంత్రి గంగుల కమలాకర్, బిజెపి నుంచి బండి సంజయ్, కాంగ్రెస్ నుంచి పురుమల్ల శ్రీనివాస్ రంగంలో ఉన్నారు. మొదట బిఆర్ఎస్ – కాంగ్రెస్ ల మధ్య ఉన్న పోటీ ఇప్పుడు బీఆర్ఎస్ – బిజెపిల మధ్య పోరుగా మారింది. కాంగ్రెస్ అభ్యర్థి పురుమల్ల శ్రీనివాస్ కు పార్టీ నేతలు, శ్రేణులు అంతగా సహకరించకపోవటం…నగరంలోని అన్ని ప్రాంతాల్లో పరిచయాలు లేకపోవటం ప్రతికూలంగా మారింది.

రేకుర్తిలో మైనారిటీల భూముల కబ్జా మంత్రి బినామీలే చేశారని ఆ వర్గం అసంతృప్తితో రగులుతోంది. పార్టీలో ఇతర కులాల వారిని పట్టించుకోలేదని నేతలు బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు. రెండు రోజులుగా బండి సంజయ్ – గంగుల కమలాకర్ మధ్య మాటల యుద్ధం ఒక్కసారిగా రాజకీయంగా వేడి సృష్టించింది. నామినేషన్ రోజు సంజయ్ కు మద్దతుగా రాజ సింగ్ రావటం…ఈ నెల 27వ తేదిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభతో వార్ వాన్ సైడ్ అని కమలం నేతలు ఉన్నారు. మైనారిటీల ఓట్లు చీలితే బండి సంజయ్, ఎవరో ఒకరికి దక్కితే బీఆర్ఎస్,కాంగ్రెస్ లకు గెలుపు అవకాశాలు ఉండనున్నాయి.

మహబూబ్ నగర్ 

మహబూబ్ నగర్ లో కూడా కరీంనగర్ పరిస్థితులే ఉన్నాయి. బీఆర్ఎస్ నుంచి మంత్రి శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ నుంచి యెన్నం శ్రీనివాస్ రెడ్డి, బిజెపి నుంచి ఏపి మిథున్ రెడ్డి పోటీలో ఉన్నారు. పార్టీలు మారటం యెన్నంకు ప్రతికూలం కాగా భూముల కబ్జా ఆరోపణలు మంత్రికి చాప కింద నీరులా సెగ పుట్టిస్తున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థిపై ముస్లీంలలో సదాభిప్రాయం లేదు. మిథున్ రెడ్డి మొదటిసారిగా బరిలో ఉండగా తండ్రి, మాజీ ఎంపి జితేందర్ రెడ్డి పార్టీ శ్రేణులను సమన్వయము చేస్తూ కమలం శ్రేణులను నడిపిస్తున్నారు.

నవంబర్ 22న సిఎం కెసిఆర్ రాకతో గులాబీ శ్రేణులు ఉత్సాహంగా ఉండగా… యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్ పర్యటన తర్వాత లెక్కలు మారుతాయని బిజెపి నేతలు అంటున్నారు. పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ బీఆర్ఎస్ – బిజెపిల మధ్య హోరాహోరీగా ఉంటుందని అంటున్నారు.

పటాన్ చెరువు 

పటాన్ చెరువులో విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ నుంచి గూడెం మహిపాల్ రెడ్డి, కాంగ్రెస్ -కాటసాని శ్రీనివాస్ గౌడ్, బిజెపి నందీశ్వర్ గౌడ్, బిఎస్పి నుంచి నీలం మధు ముదిరాజ్ తలపడుతున్నారు. బీఆర్ఎస్ నేత మధు కాంగ్రెస్, బిజేపిల్లోకి కప్పదాట్లు వేసి చివరకు ఏనుగు గుర్తుతో ప్రజల్లోకి వస్తున్నారు. ముదిరాజ్ ఓట్లు అదికంగా ఉన్నాయనే ఏకైక అజెండాతో వస్తున్న మధు…మద గజంతో ఎవరిని నిలువరిస్తారో ప్రధాన పార్టీలకు పాలుపోవటం లేదు.

సూర్యపేట, నిర్మల్, కరీంనగర్, మహబూబ్ నగర్ మూడు నియోజకవర్గాల్లో మంత్రులపై కొన్ని ఆరోపణలు, విమర్శలు ఒకే తీరుగా ఉన్నాయి. బినామీల పేరుతో భూముల కబ్జాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అనుచరులకే ఇప్పించుకోవటం, మితిమీరిన బంధు ప్రీతి, తమ సామాజిక వర్గం వారికే అందలాలు, అనువైన స్థానాలు. వెరసి మంత్రుల పట్ల ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉంది.

ఈ విధంగా పోలింగ్ నాటికి మరికొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల తలరాతలు మారే అవకాశం ఉంది. ఈ దఫా ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరగల్ జిల్లాల్లో కారును కలవర పెట్టే ఫలితాలు వస్తాయని విశ్లేషకులు అంటున్నారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్