అఖిల్, పూజా హెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. దసరాకి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించింది. ఈ సినిమా థాంక్యూ మీట్ వైజాగ్ లో ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో సినిమా యూనిట్ సభ్యులు అందరూ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ వేడుకలో హీరో అఖిల్ అక్కినేని మాట్లాడుతూ “వైజాగ్ ఇక్కడికి వచ్చిన అభిమానులు అందరికీ ధన్యవాదాలు. మంత్రి అవంతి శ్రీనివాస్ గారికి స్పెషల్ థాంక్స్. 100% ఆక్యుపెన్సీ ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. మేము చేసిన ఈ ప్రయత్నాన్ని ఆదరించి ఇంతటి అద్భుతమైన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ఎప్పుడు రుణపడి ఉంటాము. ఈ సినిమా నుంచి నేను ఒకటి నేర్చుకున్నాను. అదే టీం వర్క్. కథను నమ్మి ఈ సినిమా చేశాం. దాని ఫలితం ఇప్పుడు కళ్లముందు కనిపిస్తుంది. బొమ్మరిల్లు భాస్కర్, వాసు వర్మ, బన్నీ వాసు ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. అల్లు అరవింద్ గారు మీరు మాకు గాడ్ ఫాదర్. మీ నమ్మకాన్ని నిలబెట్టామనే అనుకుంటున్నాము. పూజా హెగ్డే కూడా ఈ సినిమా కోసం చాలా కష్టపడింది. త్వరలోనే మరోసారి వైజాగ్ వస్తాం. మరో సక్సెస్ మీట్ జరుపుకుందాం. ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను” అని తెలిపారు.
నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ ‘బొమ్మరిల్లు సినిమా తీసి బొమ్మరిల్లు భాస్కర్ అయిపోయాడు. ఇప్పుడు బ్యాచ్‌లర్ భాస్కర్ అయిపోతాడేమో తెలియదు మరి. కాకపోతే ఈ సినిమాతో ఎంత మంది కాపురాలకు సమస్యలు తెస్తాడో అనిపిస్తుంది (నవ్వుతూ). సినిమాల్లో సాధారణంగా మెసేజ్ ఎక్కదు. కానీ ఈ సినిమాలో బ్యాచ్‌లర్ అనే టైటిల్ పెట్టి పెళ్లి కాకుండానే కాపురం చూపిస్తారు ఈ చిత్రంలో. అందుకే ఈ సినిమాలో కొన్ని ప్రత్యేకమైన అంశాలు ఏంటంటే.. భార్యా భర్తలు కావాలంటే ఏయే అంశాలు కావాలో ఈ సినిమాలో చూపించారు. భార్యాభర్తలు చూస్తే ఖచ్చితంగా మొహామొహాలు చూసుకుంటారు. మహిళలు మీ భర్తలను సినిమాకు తీసుకెళ్లండి. మెసేజ్ చూసి ఆనందిస్తారు. అది మా గ్యారెంటీ. చాలా సినిమాలు ఓటిటిలో వచ్చేస్తున్నాయి. ఈ సినిమాను థియేటర్స్ కు వెళ్లి చూడాల్సిందే. త్వరలోనే ఈ సినిమా వచ్చేస్తుంది ఓటిటిలో అని నేను నిన్న చూసాను.. కానీ అది నిజం కాదు. చాలా కాలం తర్వాతే ఇది ఓటిటిలో వస్తుంది. పూజా గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఈ సినిమా కోసం చాలా కష్టపడింది. వట్టి వసంత్ గారు, గంటా శ్రీనివాసరావు గారు లాంటి వాళ్లు రావాల్సి ఉంది. కానీ కుదర్లేదు.. ఈ సినిమాను విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు” అని తెలిపారు.