మన హీరోలు ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరో వైపు బిజినెస్ లో రాణిస్తున్నారు. ఇలా బిజినెస్ లో రాణిస్తున్న హీరోల గురించి చెప్పాలంటే.. ముందుగా నాగార్జున గురించే చెప్పాలి. కింగ్ నాగార్జున మీడియా రంగంలోకి ప్రవేశించి మా టీవీని కొన్ని సంవత్సరాలు పాటు నిర్వహించారు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలోనూ, స్పోర్ట్స్ రంగంలోనూ ప్రవేశించి సక్సెస్ సాధించారు. నిర్మాతగా విజయం సాధిస్తున్నారు. నాగార్జునతో కలిసి చిరంజీవి కూడా బిజినెస్ పార్టనర్ గా ఉన్నారు. ఇప్పుడు యంగ్ స్టార్ హీరోలు కూడా బిజినెస్ పై దృష్టి పెడుతున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు, ఏసియన్ మూవీస్ అధినేత సునీల్ నారంగ్ కలిసి ఏఎంబీ సినిమాస్ స్టార్ట్ చేశారు. ఇది సూపర్ సక్సెస్ అయ్యింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో నంబర్ వన్ మల్టీప్లెక్స్ ఇదే అనడంలో సందేహం లేదు. దీని తర్వాత విజయ్ దేవరకొండతో మహబూబ్‌నగర్‌లో ఒక మల్టీప్లెక్స్‌ను నిర్మించింది ఏషియన్ సంస్థ. ప్రభాస్ కు కూడా మల్టీఫ్లెక్స్ ఉంది. అతి పెద్ద స్క్రీన్ ఉన్న మల్టీప్లెక్స్ గా దీనికి పేరుంది. ఇక త్వరలోనే అల్లు అర్జున్ కూడా ఈ బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నారు. బన్నీ భాగస్వామ్యంలో ఏషియన్ వారి కొత్త మల్టీప్లెక్స్ రాబోతోంది. త్వరలోనే ఇది ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.
హైదరాబాద్ సిటీ సెంటర్ అనదగ్గ అమీర్ పేటలో ఈ మల్టీప్లెక్స్ కమ్ మాల్ నిర్మాణం జరుపుకోవడం విశేషం. హైదరాబాద్‌లో చాలా ఫేమస్ అయిన సత్యం థియేటర్‌ను కొన్నేళ్ల కిందటే పడగొట్టేశారు. ఆ స్థానంలో ఏర్పాటు చేసిందే ఏఏఏ మల్టీప్లెక్స్ కమ్ మాల్. ఇందులో ఒక ఏ అంటే ఏషియన్ కాగా.. మిగతా రెండు ఏలకు అల్లు అర్జున్ అని అర్థం. ఇక్కడ ఐదారు స్క్రీన్లు ఉన్నట్లు సమాచారం. తెలంగాణలో ఇటు మల్టీప్లెక్సులు, అటు సింగిల్ స్క్రీన్లను అధునాతనంగా తీర్చిదిద్దుతూ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వడంతో ఏషియన్ వాళ్లు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఇక త్వరలో అల్లు అర్జున్ బ్రాండ్ తో వస్తున్న ఏఏఏ కూడా సూపర్ సక్సెస్ అవ్వడం ఖాయం అంటున్నారు సినీజనాలు.