రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉన్నాయని, ఇదే విషయాన్ని నిన్న కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా చెప్పారని బిజెపి రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ అన్నారు. అప్పులు తీసుకువచ్చి, వడ్డీలు కూడా కట్టలేకపోతున్నారని విమర్శించారు. అప్పులు తీసుకు వచ్చి ప్రజలకు ప్రయోజనం కలిగించే పనులు కూడా చేయడం లేదన్నారు. ప్రభుత్వం ఆదాయం పెంచుకునే మార్గాలను అన్వేషించాలని, యువతకు ఉపాధి అవకాశాలు చూపాలని సూచించారు. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సిఎం రమేష్ అనంతరం మీడియాతో మాట్లాడారు.
పరిస్థితులు ఇలా ఉంటే ప్రభుత్వం మాత్రం రాజధాని మార్చాలని రకరకాల ప్రయత్నాలు చేస్తోందని, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతోందని సిఎం రమేష్ ఆరోపించారు. ఈ ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ శాశ్వతం కాదని, కేవలం తాత్కాలికంగా మిగిలిపోతాయని స్పష్టం చేశారు. ప్రజలందరూ కలిసి నిర్ణయించిన రాజధాని అమరావతి అని, కానీ ఈ ప్రభుత్వం భేషజాలకు పోతోందని, ఇది మంచిది కాదని, ఈ ప్రయత్నాలేవీ నిలబడవని అన్నారు. ప్రజా రాజధానిగా అమరావతి ఉంటుందని రమేష్ ధీమా వ్యక్తం చేశారు.