తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపిస్తే ఆయనకు వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని చంద్రబాబు ఎత్తుకున్నారని, ఎవరికో పుట్టిన బిడ్డను తనదిగా చెప్పుకున్న సామెత బాబుకే సరిగ్గా సరిపోతుందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు దివంగత నేత డా. వైఎస్సార్ మానస పుత్రిక అని దాన్ని కూడా తనదిగా బాబు చెప్పుకున్నారని దుయ్యబట్టారు.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ఒకరు సతీ సావిత్రి లాగా, మరొకరు హరి హరిశ్చంద్రుడి లాగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ధర్మమంతా వారిద్దరినీ ఆవరించి ఉన్నట్లు వారి మాటతీరు ఉందన్నారు. గతంలో ఇద్దరూ కలిసి పరిపాలన చేసిన ఐదేళ్ళలో 45 దేవాలయాలను కూల్చేశారని, ప్రతి గ్రామంలో బెల్టు షాపులు పెట్టి మద్యం విక్రయించారని, గంజాయి సాగులో ఏపీని దేశంలోనే నంబర్ వన్ గా చేశారని రాంబాబు విమర్శించారు.
కరకట్ట కమల్ హాసన్ అంటూ జగన్ పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై అంబటి మండిపడ్డారు. అసలు కరకట్టపై నివాసం ఉంటున్నది ఎవరని ప్రశ్నించారు. ‘కరకట్ట ప్రకాష్ రాజ్’ అనే పేరు బాబుకు సరిగ్గా సరిపోతుందన్నారు. ఆయన వేస్తున్న క్యారెక్టర్లు అన్నీ చంద్రబాబువేనని వ్యాఖ్యానించారు. కురుక్షేత్ర సంగ్రామం అంటూ బాబు మాట్లాడుతున్నారని, గతంలో మూడు సార్లు కౌరవ వధ జరిగిందని, రెండు సార్లు వైఎస్ చేతిలో, ఒకసారి జగన్ చేతులో బాబుకు శాస్తి జరిగిందన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ మరోసారి జరగబోతుందని జోస్యం చెప్పారు.
శ్రీవాణి ట్రస్టులో అక్రమాలు జరిగాయంటూ బాబు, పవన్ ఆరోపించడం దారుణమని, తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత పెట్టిన ట్రస్ట్ అని, దేశవ్యాప్తంగా వేలాది దేవాలయాలు ఈ ట్రస్టు ద్వారా బాగు చేస్తున్నారని చెప్పారు. గతంలో తిరుమల కొండపై దళారులు ఉండేవారని, దాన్ని నిర్మూలించి నేరుగా భక్తుల డబ్బులు శ్రీవారి ఆలయానికి చేరేలా ఈ ట్రస్ట్ పెట్టారని వివరించారు. దేవుడి విషయంలో అబద్దాలు చెబితే తగిన ఫలితం అనుభవిస్తారన్నారు.
వారాహి అమ్మవారి పేరుతో ఏర్పాటు చేసిన వాహనంపై పవన్ ఎక్కి చిందులు వేస్తున్నారని, ఇలాంటి దుర్మార్గమైన ఆరోపణలు చేస్తే పుట్టగతులు ఉండవని పవన్ ను అంబటి హెచ్చరించారు. ఇళ్ళలోంచి బైటికి లాగి కొడతానని పవన్ అంటున్నారని, మేం చేతులు కట్టుకుని కూర్చుంటామా, తిక్కలోడివి కాకపొతే ఏమిటి అంటూ ఘాటుగా బదులిచ్చారు.