రాష్ట్రంలో చంద్రబాబు కంటే పెద్ద కిలాడీ ఎవరైనా ఉన్నారా అని రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. తనను ఆంబోతు రాంబాబు అనడంపై అంబటి తీవ్రంగా ప్రతిస్పందించారు. ‘నీ రాజకీయ జీవితం మొదట్లో ఆంబోతులకు ఆవులు సప్లై చేసి సీటు సంపాదిచుకున్నవ్యక్తివి నువ్వు కాదా’ అని నిలదీశారు. బాబు తన ఇటీవలి పర్యటనలలో వైసీపీ నేతలు కిలారి రోశయ్యను కిలాడీ రోశయ్యగా, బాపట్లలో కోన రఘుపతిని కిరసనాయిల్ అమ్ముకుంటున్నాడంటూ చేసిన ఆరోపణలను మంత్రి ఖండించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో అంబటి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో నంబర్ వన్ కిలాడీ చంద్రబాబేనని ఆరోపించారు.
తనకు ఇవే చివరి ఎన్నికలు అంటూ చంద్రబాబు నోరు జారారని, దాన్ని సరిచేసుకోవడం కోసం… తనకు కాదని, ప్రజలకు చివరి ఎన్నికలు అంటూ మాట మార్చారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రిగానే సభకు తిరిగి వస్తానని శపథం చేసిన బాబు ఇప్పుడు తనకు ముఖ్యమంత్రి పదవి కొత్త కాదని అంటున్నారని ఎద్దేవా చేశారు. సిఎం జగన్ ను సైకో అంటూ బాబు సంభోదించడంపై రాంబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు, బాబు, ఆయన కుమారుడు లోకేష్, ఆయన దత్తపుత్రుడు సైకోలు అంటూ మండిపడ్డారు. రాత్రిపూట పోలవరం ప్రాజెక్టు చూస్తానంటూ బాబు హడావుడి చేశారన్నారు. ఈ ప్రాజెక్టు ఆలస్యానికి కారణం ముమ్మాటికీ చంద్రబాబు ప్రభుత్వమేనని, డయా ఫ్రమ్ వాల్ కొట్టుకు పోవడం వల్లే ఇది జాప్యం అవుతుందన్నారు.
ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు చేరవేయడంలో గ్రామ, వాలంటీర్ల వ్యవస్థ ఎంతగానో కృషి చేస్తోందని అంబటి కొనియాడారు. ప్రతినెలా ఒకటో తారీఖునే ఇళ్ళ వద్దకే వెళ్లి పెన్షన్ అందిస్తున్నారని గుర్తు చేశారు. చంద్రబాబు హయాంలో ఏర్పాటైన జన్మ భూమి కమిటీలు దోపిడీ చేశాయని, కానీ తాము ఏర్పాటు చేసిన వాలంటీర్లు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వానికి- ప్రజలకు మధ్య వారధిగా పని చేస్తున్నారని అన్నారు. వాలంటీర్ల వ్యవస్థపై ఓ దినపత్రికలో వచ్చిన వార్తా కథనాన్ని అంబటి తీవ్రంగా ఖండించారు. ఈ దుష్ప్రచారాన్ని నమ్మి చంద్రబాబుకు ప్రజలు ఓటేస్తారనుకుంటే అది భ్రమే అవుతుందన్నారు.
అవినీతికి తావు లేకుండా… సామాన్యుడికి కూడా పరిపాలన అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతోనే గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తీసుకు వచ్చామన్నారు. ఈ వ్యవస్థపై ఇతర రాష్ట్రాలు కూడా అధ్యయనం చేసి తమ రాష్ట్రాల్లో అమలు చేస్తున్నాయని తెలిపారు. రెండు లక్షల 75 వేల మంది వాలంటీర్లలో ఎవరో ఒకరో ఇద్దరో తప్పు చేసినంత మంత్రాన మొత్తం వ్యవస్థనే క్రిమినల్స్ గానో, దోపిడీదారులుగానో చిత్రించడం సరికాదన్నారు. ఇలా రాస్తున్న పత్రికలే మోసపూరితమైనవని విమర్శించారు.
Also Read : Ambati Counter: ఇదేం ఖర్మ చంద్రబాబుకు: అంబటి ఫైర్