విజయవాడ స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేస్తోన్న డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని భారత రాజ్యంగ ఆవిర్భావ దినోత్సవం అయిన నవంబర్ 26న ఆవిష్కరిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. ఆకాశమంత వ్యక్తిత్వం సాక్షిగా, మనందరి కర్తవ్యాన్ని గుర్తు చేసే అంబేద్కర్ మాటలను ఈ సందర్భంగా సిఎం ప్రస్తావించారు. 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన వేడుకల్లో సిఎం జగన్ పాల్గొని జాతీయజెండాను ఆవిష్కరించారు, అనంతరం సాయుధ దళాల గౌరవవందాన్ని స్వీకరించారు.
“భౌతికంగా ఒక మనిషికి సంకెళ్ళు లేకపోయినా… ఆ మనిషికి భావాల పరంగా స్వేఛ్చ లేకపోతే అతడు స్వతంత్రంగా బతుకుతున్నట్లు కాదు, అతడు బానిసగా బతుకుతున్నట్టే… అతను భావాల పరంగా ఖైదీయే”అని అంబేద్కర్ చెప్పారన్నారు.
“ఒక మనిషి అస్తిత్వానికి మూలం స్వేఛ్చ, స్వతంత్రాలకు అర్ధం ఏమిటంటే… అతనికి/ఆమెకు ఆలోచనలు… భావాల పరంగా స్వాతంత్ర్యం ఉండడం…. తన అభివృద్ధికి, తన కుటుంబం అభివృద్ధికి అవకాశాలు ఉండడం… రాజకీయ, ఆర్ధిక, సామాజిక, విద్యా స్వాతంత్ర్యాలు ఉండడం… తరతరాల పెత్తందారీ సంకెళ్ళ నుంచి పేదలు బైటపడి ఎదిగే వాతావరణం ఉండడం… పేద వర్గాలకు అలాంటి భావ పరమైన, ఆలోచనల పరమైన మరింత స్వేచ్చ స్వాతంత్ర్యం ఇవ్వడానికి త్రికరణ శుద్దిగా, పేదల ప్రభుత్వంగా, ప్రజా ప్రభుత్వంగా కట్టుబడ్డామని “స్పష్టం చేశారు.
పోలవరం ప్రాజెక్టును 2025 జూన్ నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని సిఎం జగన్ ప్రకటించారు. ఈ ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాల వల్లే నిర్మాణం ఆలస్యం అయిందన్నారు.
గ్రామ స్వరాజ్యం; విద్య; వైద్య-ఆరోగ్యం; మహిళా సాధికారత-సామాజిక న్యాయం,వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో గత 50 నెలల కాలంలో రాష్ట్రం సాధించిన ప్రగతిని సిఎం జగన్ తన సందేశంలో వివరించారు.