నా చిన్నతనమంతా విజయవాడలోనే. గాంధీనగర్లో ఉండేవాళ్ళం. ఇంటి ఎదురుగా జింఖానా గ్రౌండ్. కొంచెం దూరంలో రోటరీ క్లబ్. హనుమంతరాయ గ్రంథాలయం ఉండేవి. బాగా చిన్నతనంలో రోటరీ క్లబ్ కి వెళ్ళేవాళ్ళం. అక్కడ లైబ్రరీలో చక్కటి కథల పుస్తకాలు చదివేవాళ్ళం. ఆడిటోరియంలో జరిగే నృత్య ప్రదర్శనలు చూసేవాళ్ళం. కొంచెం పెద్దయ్యాక హనుమంతరాయ గ్రంథాలయానికి వెళ్ళేవాళ్ళం. పైన గ్రంథాలయం, కింద ఆడిటోరియం ఉండేవి. అక్కడ ఆదివారాలు చక్కటి నాటికలు, నృత్య రూపకాలు ప్రదర్శించేవారు. జి.ఎస్. వరలక్ష్మి వంటి సినీ తారలు ఆ నాటకాల్లో ఉండేవారు. కొన్ని నాటకాలకు టికెట్ ఉండేది. అప్పుడు మేము గ్రంధాలయం వెనుక మెట్ల దారిలో వెళ్లి నాటకాలు చూసేవాళ్ళం. ఒక్కోసారి తలుపు వేసి ఉండేది. అప్పుడు నిరాశగా ఇంటికెళ్లిపోయేవాళ్ళం. అయితే ఇప్పుడు తల్చుకుంటే గొప్ప అనుభూతి.

ఉద్యోగరీత్యా హైదరాబాద్ వచ్చాక అటువంటి కార్యక్రమాలకు వెళ్లడం చాలా తక్కువ. రవీంద్ర భారతి గురించి గొప్పగా విన్నాం కానీ అక్కడ ఎక్కువ కార్యక్రమాలకు వెళ్ళలేదు. వెళ్లినా గొప్పగా అనిపించలేదు. అయితే మొన్న ఫిబ్రవరి 17 వ తేదీన శ్రీ కృష్ణదేవరాయ విరచిత ‘ఆముక్త మాల్యద’ నృత్య రూపకానికి స్నేహితులతో వెళ్ళాను. తిరిగి బాల్యంలోనికి వెళ్లిన అనుభూతి పొందగలిగాను. రవీంద్ర భారతిలో విరిగిన కుర్చీలు, చిరిగిన సీట్లు, పని చేయని ఏసీ … ఇవేవీ నా ఆనందాన్ని తగ్గించలేదు. చక్కటి నాట్యం, చూడచక్కని కళాకారులు, అద్భుతమైన అభినయం కదలకుండా కట్టి పడేశాయి.

రోజూ ఓటీ టీ లో చూసే సినిమాలు, సిరీస్ ఇచ్చే అనందం కన్నా ఈ నృత్యరూపకం ఎక్కువ ఆకట్టుకుంది. త్వరత్వరగా సెట్టింగ్స్ మారుస్తూ ఎంతో క్రమ శిక్షణతో ప్రదర్శించిన ఆముక్తమాల్యద అలరించింది. మన పిల్లలకు ఈ అనందం దక్కడం లేదే అనే బాధ కూడా కలిగింది. ప్రభుత్వం నుంచి సరయిన ప్రోత్సాహం లభిస్తే ఇటువంటి కార్యక్రమాలు చూసేలా పిల్లల్నీ తీర్చిదిద్దచ్చు. వెంపటి చినసత్యం గారి తనయ బాలా త్రిపుర సుందరి నిర్వహణ , శ్రీమతి చూడామణి రచన, వారి కుమార్తె సరోజ గారి సంగీతం అభినందనీయం. చక్కటి కార్యక్రమాన్ని అందించిన ప్రాయోజక కర్తలకు ప్రత్యేక అభినందనలు.

కె. శోభ

Also Read :

నాటక విషాద మరణం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *