Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

Teeth to bite only……పళ్లున్నది కొరకడానికే. పాల పళ్లు, వాడి పళ్లు, కోర పళ్లు, పై పళ్లు, ముత్యాల్లాంటి పళ్లు, దానిమ్మ గింజల్లాంటి పళ్లు, కట్టుడు పళ్లు, పెట్టుడు పళ్లు…ఏ పళ్లయినా…వాటి పరమ ప్రయోజనం, ఉద్దేశం కొరకడమే.

తలనుండు విషము ఫణికి….మనిషికి నిలువెల్లా విషమే…అని శతకకారుడు ఏనాడో తేల్చి చెప్పాడు.

మనం మాట్లాడే భాషలో శబ్దాల్లో కూడా దంత్యాలు ఉన్నాయి. అంటే నాలుకను పళ్ల కింద, పైన తగిలిస్తూ పలికే శబ్దాలకు పళ్లు చాలా కీలకం. నమలడానికే కాక నోట్లో పళ్ల అవసరం ఇంకొన్ని పనులకు కూడా ఉంది.

మూడు పూటలా ఆరారా మనం పొట్టలోకి వేసే పదార్థాల రుచి నాలుకకు తెలుస్తుంది కానీ…నాలుకకంటే ముందే వాటిని కొరికే పళ్లకు ఆ రుచి అస్సలు తెలియదు. పొట్టకు కూడా రుచితో సంబంధం లేదు.

పళ్లు, గోళ్లు లక్షల జీవులకు చాలా కీలకం. పులి గోళ్లు ఇతర మారణాయుధాల కంటే పవర్ ఫుల్. సింహం నోట్లో పళ్ల మధ్య మదగజం కుంభస్థలమయినా మౌనంగా ఉండాల్సిందే. మొసలి నోట్లో పళ్ల మధ్య చిక్కుకుంటే వెయ్యేళ్లు పోరాడినా గజేంద్రుడి కాలు బయటికి రాలేదు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు వైకుంఠం నుండి దిగివచ్చి సుదర్శన చక్రం వేస్తేగానీ మొసలి పళ్ల మధ్య ఏనుగు కాలికి విముక్తి కలగలేదు.

కొన్ని పాములు కాటు వేస్తే పచ్చని చెట్టు మాడి మసై పోతుంది. కరచు అన్న మాట భావార్థకంలో కాటు అవుతుంది. పాము కాటు, తేలు కాటు, కుక్క కాటు…అని లోకంలో ఎన్నో కాట్లు ఉన్నాయి. కుక్క కరిస్తే కుక్క కాటు అయినప్పుడు…మనిషి కరిస్తే వ్యాకరణం ప్రకారం మనిషి కాటు అవుతుంది. పళ్లున్న కుక్క కరుస్తున్నప్పుడు…పళ్లున్న మనిషికి కరిచే అధికారం, అవకాశం, హక్కు తప్పనిసరిగా ఉంటాయి. అవసరాన్ని బట్టి మనిషి కరుస్తాడు.

ఒక నటికి ఏ అవసరమొచ్చిందో సాటి మనిషిని కరిచింది…సారీ…కొరికింది. కొరికిన మనిషి పేరుతో కాటును చెబితే “బంగారు    కాటు” అవుతుంది. కాటుకు గురయిన మనిషి ఏదో ఇంజక్షన్లను వేయించుకున్నట్లు చెప్పడం వ్యంగ్యమో? హాస్యమో? నిజమో? మనకు తెలియదు.

సంస్కృతంలో తాడును పాశం అంటారు. మెడకు పాశంతో కడతాం కాబట్టి జంతువులను పశువులు అంటున్నాం. పాశంతో కట్టబడినది పశువు. మనిషికి కూడా కర్మ పాశాలు కనిపించకుండా చాలా కట్టేసి ఉంటాయి. అందుకే మనుషులను కూడా పశువులతో కలిపి మొత్తానికి పశుపతిగా శివుడు ఈ మందను చూసుకుంటూ ఉంటాడు.

పశు జన్మ నీచమయినది అని మనం ఎలా అనుకుంటున్నామో…అలాగే మనిషి జన్మ నీచమయినది అని పశువులు అనుకుంటే…కాదనే అధికారం మనకు ఉండదు.

మనిషివా? పశువువా?
మనిషికో మాట…గొడ్డుకో దెబ్బ.
ఇంత గడ్డి పెట్టండి.
కడుపుకు అన్నం తింటున్నావా? గడ్డి తింటున్నావా?
గొడ్డును బాదినట్లు.
ఏనుగు చచ్చినా ఒకటే…బతికినా ఒకటే.
ఎంత ఆకలయినా…సింహం గడ్డి మేయదు.
పాముకు పాలు పోసి పెంచినట్లు.
పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగినట్లు.
గుంట నక్క.
అడవి పందులు మీద పడ్డట్లు.
కుక్కలు చించిన విస్తరి.
ఈనగాచి నక్కల పాలు చేసినట్లు.
ఏనుగు పోతుంటే కుక్కలు మొరిగినట్లు.
గుడ్లగూబ కళ్లు.
రాబందుల రెక్కల చప్పుడు.

మన బతుకంతా పశు ప్రేమే. పశు పోషణే. పశు పరిభాషే.

వార్తా ప్రాధాన్యంలో మీడియా మౌలిక సూత్రం:-
“కుక్క మనిషిని కరిస్తే వార్త కాదు;
మనిషే కుక్కను కరిస్తే వార్త”

-పమిడికాల్వ మధుసూదన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com