Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

Tit for Tat:
“క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః
స్మృతిభ్రంశాద్బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి”

తాత్పర్యం-
కోపం వల్ల అవివేకం, అవివేకం వల్ల స్మృతిభ్రంశం, దాని వల్ల బుద్ధీ చెడతాయి. ఆ బుద్ధి చెడగానే మనిషి నశించిపోతాడు.

కోపంతో మొదలయ్యే పతనం చివరికి మనిషిని ఎలా నామరూపాలు లేకుండా చేస్తుందో భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చాలా స్పష్టంగా చెప్పాడు.

తన కోపమె తన శత్రువు,
తన శాంతమె తనకు రక్ష, దయ చుట్టంబౌ
తన సంతోషమె స్వర్గము,
తన దుఃఖమె నరక మండ్రు తథ్యము సుమతి!”

అని ఇదివరకు ఒకటి, రెండు తరగతుల్లోనే కోపమే మన కొంప ముంచుతుందని అవగాహన కలిగించేవారు. పాము తన కుబుసాన్ని తనే ఒడుపుగా వంకర్లు తిరగకుండా విడిచిపెట్టినట్లు...మన కోపాన్ని మనమే వదిలించుకోవడం అలవాటు చేసుకోవాలన్నారు.

వాల్మీకి నారదుడిని అడిగిన పురుషోత్తముడి పదహారు గుణాల్లో “జిత క్రోధః”, “కస్య బిభ్యతి దేవాః?” రెండూ ఉన్నాయి. కోపాన్ని జయించినవాడు మొదటిది. ఎవరు కోప్పడితే దేవతలు కూడా వణికిపోతారో? అన్నది రెండోది. ఎప్పుడు, ఎందుకు, ఎవరిమీద ఎంత సేపు కోప్పడాలో తెలిసినవాడు రాముడు.

“పేదవాడి కోపం పెదవికి చేటు” అని తీర్మానించడంలో ప్రజాస్వామిక స్ఫూర్తి లోపిస్తోంది. సంపన్నులే కోప్పడాలి అన్నది సర్వ సమానత్వ భావనకు గొడ్డలిపెట్టు.

కోపం ఎవరికి ఎలా ఎంత తీవ్రంగా వస్తుంది? అన్నది మనిషిని బట్టి, సందర్భాన్ని బట్టి ఉంటుంది. ఉత్తముల కోపం క్షణంలో ఆవిరవుతుంది. మధ్యముల కోపం కొంత కాలం ఉంటుంది. అధముల కోపం జీవితాంతం ఉంటుంది అని కూడా ఒక సంస్కృత నీతి శ్లోకం తీర్మానించింది.

సూర్యాపేటలో ఒక ఆటో డ్రయివర్ కోపం పోలీసులకు చుక్కలు చూపించింది. ఒకరోజు ఎప్పుడో ఆటో డ్రయివర్ తన బైక్ మీద వెళుతూ పోలీసులకు దొరికాడు. సాధారణంగా ఇలాంటప్పుడు మనదగ్గర ఏ పేపర్లు ఉండవో అవే అడుగుతూ ఉంటారు పోలీసులు. ఆర్ సి ఏదీ? ఇన్సూరెన్స్ ఏదీ? లైసెన్స్ ఏదీ? టైర్లో గాలేది? గాల్లో పొల్యూషన్ ఏదీ? అని సహజంగా వారు అడిగే ప్రశ్నలు అడిగారు. మనవాడి దగ్గర ఏ పేపర్లూ లేవు. నోట్లో మాట లేదు. దాంతో బైక్ ను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. ఫైన్లు కట్టి బైక్ తీసుకెళ్లు అని ఒక కాగితం చేతికిచ్చారు.

అంతే….
మనవాడు కోపంతో ఊగిపోయాడు. కానీ ఎదురుగా ఖాకీ డ్రస్ లో ఉన్న పోలీసులు. అవమాన భారంతో ఇంకికొచ్చాడు. కోపం కట్టలు తెంచుకుంది. కన్నుకు కన్ను- కాలుకు కాలు సామెత గుర్తుకొచ్చింది. నా బైక్ తీసుకెళ్లారు కదా? మీ పోలీసు కారునే హైజాక్ చేసే దాకా నా కోపం చల్లారకుండా దాని మీద రోజూ టెన్ ఎం ఎల్ పెట్రోల్ పోస్తుంటా అని కోప ప్రతిజ్ఞ చేసి…ఒక దుర్ముహూర్తంలో పోలీస్ పెట్రోలింగ్ పెద్ద వెహికిల్ ను హైజాక్ చేశాడు.

ఎవరయినా దొంగలు దొంగతనం చేస్తే పోలీసులకు చెప్పుకుంటాం. పోలీసులనే దోచుకుంటే పాపం వారు ఎవరికి చెప్పుకుంటారు? చచ్చి చెడి…జి పి ఎస్ ట్రాకింగ్ ఉంది కాబట్టి చివరికి ఎలాగో ఆటో డ్రయివర్ చెర నుండి పెట్రోలింగ్ వాహనాన్ని తెచ్చుకోగలిగారు. బైక్ కు కారును తీసుకెళ్లినవాడు…కారును వెనక్కు తెచ్చిన అవమాన భారంతో…భవిష్యత్తులో ఏ కాన్వాయ్ ని అపహరిస్తాడో అన్న భయంతో పోలీసులు వణికిపోతున్నారట.

అరెస్టయిన ఈ ఆటో డ్రయివర్ మానసిక పరిస్థితి బాగోలేదని ఎపిసోడ్ చివర పోలీసులకు తెలిసిందట. ఒక నిర్మాత పొత్తి కడుపులో తూటా దించిన కథానాయకుడి మానసిక పరిస్థితి బాగోలేదని ఒకానొక వైద్యుడు సర్టిఫికెట్ ఇవ్వడంతో ఆ తూటా పేల్చిన వ్యక్తి విలన్ కాకుండా హీరోగానే ఉండగలిగారు. ఈ కోణంలో ఈ ఆటో డ్రయివర్ కు కూడా మెంటల్ సర్టిఫికెట్ వస్తే నేరం నేరం కాకుండా క్షమించి వదిలేయాల్సిన “ఒకానొక మెంటల్ స్థితి” అవుతుందేమో! ఏమో?

-పమిడికాల్వ మధుసూదన్
[email protected]

Also Read :

దారి చూపని దేవత

Also Read :

ఊరి పెద్దల తీర్పు శిరోధార్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com