జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఓ విలక్షణమైన నాయకుడు. వ్యక్తిగతంగా నిజాయితీ పరుడు..ఆవేశపరుడు…సమస్యలపై స్పందించే తత్వం కలిగిన నేత. సామ్యవాద భావజాలం కలిగిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు చేజేతులా పార్టీని నిర్వీర్యం చేసేందుకు కృషి చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ శల్య సారథ్యంతో జనసేన నట్టేట మునిగే సమయం మొదలైంది.
చంద్రబాబును అరెస్టు చేస్తే ఆ పార్టీ నేతల కన్నా ఎక్కువగా పవన్ జుట్టు పీక్కుంటున్నాడు. తెలుగుదేశం తమ్ముళ్ళ కన్నా ఎక్కువగా ఆవేశానికి లోనవుతున్నాడు. ఇన్నాళ్ళు బిజెపితో పొత్తు ఉందని చెప్పిన జనసేనాని ఈ రోజు తెలుగు దేశం పార్టీతో కలిసి ఎన్నికల బరిలోకి దిగుతామని ప్రకటించాడు. చంద్రబాబును పరామర్శించేందుకు రాజమహేంద్రవరం వచ్చిన పవన్… లోకేష్, బాలకృష్ణలతో కలిసి మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.
నేను ప్రస్తుతం ఎన్ డి ఏ కూటమిలో ఉన్నాను. అయితే రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూసేందుకే ఈ నిర్ణయం… అని జనసేన అధినేత స్పష్టం చేశారు. తాజా ప్రకటనతో జనసేన అభిమానుల్లో నైరాశ్యం కమ్ముకుంది.
గుంటూరు, కృష్ణ, ఉభయ గోదావరి జిల్లాల్లో కమ్మ, కాపు కులాల మధ్య ఏళ్ళుగా వైరం ఉంది. రంగ హత్యతో అది ఇంకా పెరిగింది. క్షేత్ర స్థాయిలో కాపు నేతలు బలంగా ఉన్నా… ముఖ్యమంత్రి పదవి చేపట్టే స్థాయి నాయకుడు ఇప్పటి వరకు రాలేదు. రాజకీయాలు కూడా కాపులకు కలిసి రాలేదు.
చిరంజీవి విఫలం అయ్యాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరవాలేదు అనుకుంటే…. ఎంతసేపు చంద్రబాబు కనుసన్నల్లోనే పవన్ నడుచు కుంటున్నాడు. ఉద్దానం బాధితులకు బాసటగా నిలిచినపుడు అందరు ప్రశంసించారు. తీరా ఎన్నికల్లో గెలుపు దగ్గరకు వచ్చేసరికి పలాసలో డిపాజిట్ కూడా దక్కలేదు. పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయాల్సిన నేత… ఎంత సేపు సభలు..ఆవేశపూరిత ప్రసంగాలతో కాలం వెళ్లదీస్తున్నారు.
చంద్రబాబు అరెస్టు తర్వాత పోలీసులు అడ్డుకున్నారని జగ్గయ్యపేట వద్ద పవన్ రోడ్డు మీద పడుకున్నాడు. టిడిపి నేతలు ఎవరు ఈ స్థాయి విదేయేత చూపలేదు. దీనిపై విమర్శలు వచ్చాయి. నిజానికి చంద్రబాబు దగ్గరకు పయనమైన జనసేనాని…పోలీసులు అడ్డుకోవటంతో తన పార్టీ సమావేశం కోసం వెళుతుంటే అడ్డుకుంటున్నారని కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఆ రోజు పవన్ కాన్వాయ్ జాతీయ రహదారి మీద మితిమీరిన వేగంతో వెళుతోంది. ఎంతో మంది యువకులు అదే వేగంతో అనుసరిస్తున్నారు. జరగరానిది జరిగితే ఎవరు బాధ్యులు. పవన్ ప్రజా సమస్యల పరిష్కారం కోసం రోడ్డు మీద బైటాయించి ఉంటె అందరు హర్షించే వారు.
కొన్నాళ్ళుగా కాపుల్లో మేధావులు జనసేనను ఆశాకిరణం అని భావించారు. ఈ రోజు నుంచి జనసేన గ్రాఫ్ ప్రజల్లో పడిపోతుంది అనటంలో సందేహం లేదు.
అయితే రాజమండ్రి జైలు వద్ద ప్రెస్ మీట్ లో ఓ ఆసక్తి కరమైన సన్నివేశం చోటు చేసుకుంది. పవన్ కళ్యాణ్ ఆవేశంగా మాట్లాడుతుంటే… ఎమ్మెల్యే బాలకృష్ణ మౌనంగా చూడాల్సిన పరిస్థితి వచ్చింది.
సినిమా లోకంలో బాలయ్య బాబు ఆహా ఓహో అని జబ్బలు చరుచుకునే కొందరు వీరాభిమానులకు కొంత నిరాశే…సిని రంగంలో కూడా ఈ రెండు కులాల మధ్య సఖ్యత లేదు. ఈ విషయంలో పవన్ అభిమానులు సంబర పడుతున్నారు.
ప్రస్తుతం తమతో పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ ఏకపక్షంగా టిడిపితో పొత్తు ప్రకటన చేయడం బిజెపి అగ్రనేతలను చికాకు పరిచే అంశమే. 2014 తరహాలో బిజెపి-తెలుగుదేశం- జనసేన కూటమిగా పోటీ చేయాలని బిజెపి రాష్ట్ర శాఖ నేతలు చాలా మంది ఆశిస్తున్నా అది నెరవేరే సూచనలు కనబడడం లేదు. పవన్ ప్రకటనపై బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు స్పందించారు. బిజెపికి కేవలం జనసేనతో మాత్రమె పొత్తు ఉంటుందని స్పష్టం చేయటం కొసమెరుపు.