మంగళగిరి నగరం నడిబొడ్డున ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి పెద కోనేరు పూడిక తీత పనులు దాదాపుగా ముగిశాయి. ఈ సందర్భంగా కోనేరులో పురాతన వస్తువులు లభ్యమయ్యాయి. 1870, 1880, 1890 సంవత్సరాల కాలం నాటి రాగి అణాలు, లక్ష్మీ నరసింహ స్వామి వారి పూజ సామాగ్రి బైటపడ్డాయి.
ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఆలయ అధికారులు ఈ వస్తువులను మీడియాకు ప్రదర్శించారు. ఈ పురాతన సంపదను తహసీల్దార్ జి.వి రాంప్రసాద్ కు అందజేసి ఏ.ఎస్.ఐ నివేదికకు పంపనున్నారు. అనంతరం ప్రజలు సందర్శనార్థం అందుబాటులో ఉంచుతామని తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ మురికికూపంగా ఉన్నపెద్ద కోనేరు చారిత్రాత్మకతను నేటి సమాజానికి తెలియచెప్పేందుకు పునరుద్ధరణ పనులు చేపట్టామని తెలిపారు. సుమారు 470 సంవత్సరాలు క్రితం అప్పుడు పరిపాలించిన రాజులు ప్రజల కోసం ఇటువంటి చారిత్రాత్మక కట్టడాలను నిర్మించారని, కాలక్రమేణా అవి మరుగున పడిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
కోనేరు పూడిక తీత పనులలో భాగంగా 150 నుంచి 152 అడుగుల లోతు వరకు వెళ్ళడం జరిగిందని, అట్టడుగు భాగం నుంచి పది అడుగుల ఎత్తు వరకు చుట్టూ కొండరాయి ఉందని ఆపైన మెట్లు నిర్మించిన ఆనవాళ్లు బయటపడ్డాయని వివరించారు. ఇంతటి గొప్ప కార్యక్రమం నిర్వహించడం తమ అద్రుస్తామని, ప్రజలకు ఇదో గొప్ప భాగ్యమని అభివర్ణించారు. పెద కోనేరుకు పూర్వ వైభవాన్ని తీసుకువచ్చి అతి త్వరలోనే భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు.