Saturday, January 18, 2025
HomeTrending NewsMedia: ఆ రెండు పత్రికలకు చంద్రబాబే లోకం

Media: ఆ రెండు పత్రికలకు చంద్రబాబే లోకం

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు జోరు మీదున్నాయి. చంద్రబాబు అరెస్టుతో తెలుగుదేశం పార్టీలో అలజడి నెలకొంది. ఇన్నాళ్ళూ తమ నేతకు ఎదురులేదని భావించిన వారు సైతం ఇప్పుడు ఆత్మరక్షణలో పడిపోయారు. కాలం కలిసిరానప్పుడు ఎవరు ఎవరినీ కాపాడలేరని బాబు అరెస్టుతో తేట తెల్లమైంది. ఏలేరు కుంభకోణం దగ్గర నుంచి ఆబ్కారీ స్కాం,  ఓటుకు నోటు వ్యవహారం వరకూ ఎన్నో ఆరోపణలు టిడిపి అధినేతపై వచ్చినా సదరు కేసుల్లో వెంటనే  న్యాయస్థానాల్లో స్టే రావడం పరిపాటిగా జరిగేవి.

ఒకవేళ బాబు ఎలాంటి తప్పూ చేసి ఉండకపోతే తనపై వచ్చిన ఆరోపణకు స్వచ్చందంగా విచారణకు అంగీకరించాల్సింది. అలా చేస్తే చంద్రబాబు ప్రతిష్ట ఎవరెస్టు అంత పెరిగేది. న్యాయవ్యవస్థలో బాబు పవర్ ఫుల్ అనే నానుడి దేశ రాజకీయాల్లో ఎప్పటినుంచో ఉంది.  బాబుపై న్యాయపోరాటం డబ్బులు దండుగ తప్ప సాధించేమీ లేదన్న నిర్ణయానికి వచ్చిన  డా. వైఎస్సార్, సుప్రీంకోర్టులో బాబుపై వేసిన కేసులను ఉపసంహరించుకున్నారు కూడా.

చంద్రబాబు మీద ఆరోపణలు రాగానే పార్టీ నేతల కన్నా ముందు రెండు తెలుగు పత్రికలు, మరికొన్ని టివి చానెళ్ళు అల్లికలు కుట్లు మొదలు పెట్టేవి. తెల్లవారగానే ఆ పత్రికలే ప్రామాణికంగా మీడియాలో చర్చలకు వెళ్ళటం  తెలుగు తమ్ముళ్ళకు ఆనవాయితీగా మారింది. చర్చల్లో ఎవరైనా ప్రశ్నిస్తే ఆ పత్రికల వార్తలను చూపటం…వాటిని నైతికతకు ప్రామాణిక గ్రంథాలుగా  చూపేవారు. అలా ఆ రెండు పత్రికలూ చంద్రబాబునాయుడు వెన్నంటి ఉంటాయి.

చంద్రబాబు కాకుండా ఇతర రాష్ట్ర నాయకులు, దేశం గురించి రాయాల్సి వస్తే సమసమాజ స్థాపన కోసమే తమ పత్రికలు పనిచేస్తున్నట్టు సంపాదకీయాలు ఉంటాయి. అవినీతిని ఉపేక్షించే ప్రసక్తే లేదన్నట్టుగా చెడుగుడు ఆడుతాయి. అందప్రదేశ్ దగ్గరికి వస్తే చంద్రబాబు తప్పితే అందరు విలువలు లేని వారే అన్నట్టుగా కథనాలు ఉంటాయి.

చంద్రబాబు అడుగులకు మడుగులు ఒత్తితే జూనియర్ ఎన్టిఆర్ టాప్ హీరో… లేదంటే ఆ హీరో గురించిన వార్తలు ఎక్కడా కనిపించవు. చంద్రబాబు వైఖరి నచ్చక YSRCP లో ఉన్నందుకు మాజీ మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీ తదితర నాయకులపై దుమ్మెత్తి పోయటమే పనిగా ఈ మీడియా కథనాలు తయారు చేస్తుంది.

చంద్రబాబు అరెస్టు తర్వాత  దేశవ్యాప్తంగా ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారని, నీతి నిజాయతీతో పనిచేసిన విజనరీ నాయకుడిపై ఇంత ఘోరమా అని వారు వాపోతున్నట్టుగా ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ చానెల్లో వార్తలు ఉంటాయి. ఇక ప్రపంచంలో ఏం  జరిగినా మమ అన్నట్టుగా రాస్తున్నారు. ఇన్నాళ్ళు కొంత విలువలు పాటించినట్టు నమ్మించిన ఈనాడు యాజమాన్యం.. చంద్రబాబు అరెస్టు తర్వాత బజార్ల పడ్డది.

తెలుగుదేశం అధినేత అరెస్టు తర్వాత రిమాండ్ విధిస్తూ ఏసిబి కోర్టు న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. ఆ వార్త హెడ్డింగ్ లోనే జడ్జి పేరును ప్రముఖంగా ప్రచురించారు. తాజాగా క్వాష్ పిటిషన్ తిరస్కరించిన తీర్పులో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తి పేరును హెడ్డింగ్ లో ప్రచురించారు. ఇలా ఈనాడు యాజమాన్యం విలువలకు తిలోదకాలు ఇచ్చింది.  న్యాయపరమైన వార్తలు రాసేటపుడు న్యాయమూర్తుల పేర్లు ప్రస్తావించాల్సిన అవసరం లేదని స్పష్టంగా ఆదేశాలు ఉన్నా ఆ అంశం పట్టించుకున్న దాఖలాలు లేవు.

అయితే ఆంధ్రజ్యోతి, ఈనాడు ల ద్వారా తెలుగు రాష్ట్రాల ప్రజలకు కొన్ని భ్రమలు తొలిగాయి. ఇప్పటివరకు ఈ రెండు పత్రికల వార్తలను అంతో ఇంతో నమ్మే వారు సైతం ఇప్పుడు ఈసడించుకుంటున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్