Tuesday, September 17, 2024
HomeTrending Newsఏపి ఎన్నికలు సిఎం రేవంత్ రెడ్డికి పరీక్ష

ఏపి ఎన్నికలు సిఎం రేవంత్ రెడ్డికి పరీక్ష

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావటంతో పార్టీ అధిష్టానంలో కొత్త ఆశలు చిగురించాయి. పొరుగున ఆంధ్రప్రదేశ్ లో పార్టీ బలోపేతం చేసే దిశగా కసరత్తు మొదలు పెట్టింది. ఏపి వ్యవహారాల ఇంచార్జ్ గా మనిక్కం టాగూర్ ని నియమించి రాష్ట్ర నేతలతో తరచుగా సమావేశాలు నిర్వహిస్తోంది. తాజాగా రాష్ట్ర పార్టీ పగ్గాలను YS షర్మిలకు అప్పగించింది.

ఏపిలో పార్టీకి పునర్ వైభవం తీసుకొచ్చేందుకు సహకరించాలని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అధిష్టానం ఆదేశించినట్టు సమాచారం. నెలకు మూడుసార్లు ఏపి నేతలతో సమావేశాలు, అవసరమైతే అక్కడ పార్టీ కార్యక్రమాల్లో పాల్గోనేట్టుగా ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని సూచించినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డికి రాబోయే ఏపి శాసనసభ ఎన్నికలు సంకటంగా మారనున్నాయి. రాజకీయ గురువు చంద్రబాబుకు మద్దతు ఇవ్వటమా..రాహుల్ గాంధి సూచనలకు అనుగుణంగా పార్టీ బలోపేతానికి సహకరించాటమా తేల్చుకోవల్సి ఉంది.

శాసనసభ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి వెనుక కమ్మ సామాజిక వర్గం వారే ఉన్నారని, ఆర్థికంగా వారే సర్దుబాటు చేశారని రాజకీయ వర్గాల బోగట్టా! చంద్రబాబుతో వ్యతిరేకత, ఏపి సిఎం జగన్ తో సాన్నిహిత్యంతో కెసిఆర్ పట్ల ఈ సామాజికవర్గం అసంతృప్తిగా ఉండిందని సమాచారం. దీంతో పారిశ్రామిక వేత్తల నుంచి మీడియా సంస్థల వరకు ఈ వర్గానికి చెందిన అందరు రేవంత్ రెడ్డికి మద్దతు పలికారని, అన్నింటిని మించి రేవంతుడు… చంద్రబాబు శిష్యుడు కావటం మరింత చేరువ చేసింది.

తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు, సిఎంగా రేవంత్ రెడ్డి ఎంపిక తర్వాత ఆయన పార్టీ లైన్ లో ఉంటారని అందరు భావించారు. రాజకీయంగా ఆయన ప్రస్థానం చూసినా ఎవరితో అంటకాగినట్టు కనిపించరు. కేవలం రాజకీయ అవసరాలకు అనుగుణంగా నడుచుకుంటారని సన్నిహితులు చెపుతుంటారు.

ఇటీవల ఓ టివి చానెల్ ఇంటర్వ్యూలో సిఎం వ్యాఖ్యలు పరిశీలిస్తే పూర్తిగా తెలుగుదేశం హోల్డ్ లో ఉన్నట్టుగా అనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తమిళనాడు, కర్ణాటక మాదిరిగానే తనకు ఏపి అని సిఎం చెప్పటం విమర్శలకు దారి తీసింది. రాష్ట్రాలుగా విడిపోయినా రెండు రాష్ట్రాల్లో ఉన్నది తెలుగు వారు అన్న సంగతి మరిచిపోయి మాట్లాడటం సరికాదని కాంగ్రెస్ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

YS షర్మిల ఏపి రాజకీయాలకే పరిమితం అవుతారని ఆ ఇంటర్వ్యూలో అన్నారు. అధిష్టానం ప్రకటించకన్నా ముందే సిఎం వెల్లడించటం కాంగ్రెస్ సీనియర్ నేతలను సైతం నివ్వెర పరిచింది. శాసనమండలిపై సిఎం వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. తెలంగాణ సిఎం ఏపి కాంగ్రెస్ నేతలను కలుపుకొని పోవటం రాబోయే రోజుల్లో ముఖ్యమైన అంశం. ఈ వ్యవహారంలో ఏ మాత్రం నిర్లక్ష్యం, పెడసరితనం కనిపించినా అధిష్టానం సహించే స్థితుల్లో లేదని ఢిల్లీ వర్గాలు తేల్చి చెప్పాయి.

రాజకీయ ఎదుగుదలకు సహకరించిన గురువు ఋణం తీర్చుకోవటమా… ప్రభుత్వంలో అత్యున్నత పదవి ఇచ్చి పార్టీలో అగ్రతాంబూలం కట్టబెట్టిన పార్టీకి విధేయుడిగా నడిచుకోవటమా…రేవంత్ రెడ్డి ముందున్న సవాల్. రెండింటిని సమన్వయము చేయాలని చూస్తే రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డికి కష్టాలు తప్పవని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్