Friday, October 18, 2024
Homeసినిమా'మధురవాణి'గా అలరించనున్న అంజలి!

‘మధురవాణి’గా అలరించనున్న అంజలి!

‘మధురవాణి’ అనే పేరు వినగానే ‘కన్యాశుల్కం’ నాటకం గుర్తుకు వస్తుంది. గిరీశంతో కలిసి మధురవాణి చేసే సందడి .. ఒలకబోసే వయ్యారాలు కళ్లముందు కదలాడతాయి. ‘కన్యాశుల్కం’ గురించి ఈ జనరేషన్ కి పెద్దగా తెలియదేమోగానీ, ఆ పై వరుసలో ఉన్నవారిలో చాలామందికి తెలుసు. ‘కన్యాశుల్కం’ కంటెంట్ ను అటు వెండితెరపైన .. ఇటు బుల్లితెరపైన చాలామంది టచ్ చేశారు. ఇప్పుడు ఆ నాటకం వెబ్ సిరీస్ గా ప్రేక్షకులను పలకరించనుంది.

గురజాడ అప్పారావు రాసిన ‘కన్యాశుల్కం’ నాటకాన్ని వెబ్ సిరీస్ గా అందిస్తున్నారు. శేష సింధూరావు  దర్శకత్వం వహించిన ఈ సిరీస్, క్రిష్ పర్యవేక్షణలో కొనసాగింది. అన్ని వ్యవహారాలను ఆయన దగ్గరుండి చూసుకున్నారు. ‘వీరమల్లు’ షూటింగుకి గ్యాప్ ఎక్కువగా రావడం వలన, ఆయన ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించారని తెలుస్తోంది. ఆయన సారథ్యంలో ఈ సిరీస్ 6 ఎపిసోడ్స్ ను పూర్తి చేసుకుంది. జీ 5లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానున్నట్టుగా సమాచారం.

గిరీశంగా అవసరాల శ్రీనివాసరావు నటించిన ఈ సిరీస్ లో మధురవాణిగా అంజలి కనిపించనుంది. నిజానికి ఈ పాత్రను పోషించాలని చాలామంది ఆర్టిస్టులు కలలు కంటూ ఉంటారు. అలాంటి పాత్రను పోషించే అవకాశం అంజలికి రావడం అదృష్టంగానే చెప్పుకోవాలి. ‘ఝాన్సీ’ .. ‘ఫాల్’ వంటి వెబ్ సిరీస్ లు అంజలికి మంచి పేరును తీసుకొచ్చాయి. అలాగే ఈ సిరీస్ కూడా ఆమె కెరియర్లో ప్రత్యేకమైన స్థానంలో నిలిచిపోతుందని చెప్పచ్చునేమో.

RELATED ARTICLES

Most Popular

న్యూస్