Even Navaratnaalu also: సిఎం జగన్ పై రాష్ట్ర ప్రజలకు మోజు తగ్గిందని, ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరుగుతోందని టిడిపి యువనేత, శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు. ప్రజలు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారని, గత పాలనలో జరిగిన అభివృద్ధిని గుర్తు చేసుకుంటున్నారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, జగన్ కనీసం నవరత్నాలు కూడా సక్రమంగా అమలు చేయలేకపోతున్నారని ఆయన విమర్శించారు.
విభజన సమస్యలపై కేంద్ర హోం శాఖ కమిటీ సమావేశం ఎజెండాలో ప్రత్యేక హోదా అంశం పొందుపరిస్తే అది తమ గొప్పతనంగా వైసీపీ నేతలు చెప్పుకున్నారని, గంటల వ్యవధిలోనే ఆ అంశాన్ని తొలగిస్తే ఎందుకు స్పందించలేదని రామ్మోహన్ నిలదీశారు. ప్రత్యేక హోదా విషయమై పార్లమెంట్ లో వైసీపీ ఎంపీలు ఎందుకు మాట్లాడడం లేదని, ఎందుకు పోరాటం చేయడం లేదని ప్రశ్నించారు.
తమ రాష్ట్రాల ప్రయోజనాల విషయంలో మమతా బెనర్జీ, స్టాలిన్, కేసిఆర్ కేంద్రంపై పోరాడుతుంటే జగన్ మాత్రం ఎందుకు మౌనంగా ఉంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. సినిమా టిక్కెట్ల వ్యవహారంలో సమస్యను తానే సృష్టించి, హీరోలను కావాలని పిలిపించుకుని పొడిగించుకున్నారని ఎద్దేవా చేశారు.
Also Read : ఉద్యోగులను మోసం చేశారు: బాబు