Kannababu fire: ఎన్నికలు ఎప్పుడు జరిగినా తమకు 160 సీట్లు వస్తాయంటూ టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడి వ్యాఖ్యలు పిట్టల దొరల మాటను తలపిస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ నేతలు భ్రమల్లో బతుకుతున్నారని, పగటి కలలు కంటున్నారని వ్యాఖ్యానించారు. నేడు తెలుగు రైతు ఆధ్వర్యంలో జరిగిన వర్క్ షాప్ లో అచ్చెన్నాయుడు చేసిన కామెంట్లపై కన్నబాబు తీవ్రంగా ప్రతిస్పందించారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. నాబార్డు ఛైర్మన్ ఇవాళ రాష్ట్రంలో పర్యటిస్తున్నారని తెలిసే టిడిపి ఈ వర్క్ షాప్ ఏర్పాటు చేసిందన్నారు. అబద్ధాలను అలవోకగా ప్రచారం చేయడంలో తెలుగుదేశం పార్టీని కొట్టేవాడు ప్రపంచంలోనే లేరని విమర్శించారు.
రాష్ట్రంలో క్రాప్ హాలిడే ప్రకటించారని చెబుతున్న అచ్చెన్న అది ఎక్కడో చూపించాలని డిమాండ్ చేశారు, ఇలాంటి సిగ్గులేని మాటలు మాట్లాడొద్దని తీవ్రంగా వ్యాఖ్యానించారు. రైతులకు ఏ చిన్న సమస్య వచ్చినా పరిష్కరించే విధంగా తమను సిఎం జగన్ సంసిద్ధం చేశారని తెలిపారు. రెండో పంటకు గోదావరి డెల్టాలో నీరివ్వరని టిడిపి ప్రచారం చేసిందని, కానీ సాధారణ రోజుల్లో… ఖరీఫ్ పంట వేసే రోజుల్లో ఇచ్చే విధంగా ఈరోజు కూడా 10,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశామని తెలిపారు. ఒక్క ఎకరా కూడా ఎండిపోకుండా చూస్తున్నామన్నారు. దేశంలోనే ఏపీ రాష్ట్రం వ్యవసాయ రంగంలో నంబర్ వన్ స్థానంలో ఉందని, గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ ద్వారా కేంద్రం ఈ విషయాన్ని వెల్లడించిందని, సిఎం జగన్ వల్లే ఇది సాధ్యమైందన్నారు.
అచ్చెన్నాయుడు నోరు అదుపులో పెట్టుకోవాలని కన్నబాబు హెచ్చరించారు. మంత్రులు ఏదైనా ఒక చిన్న మాట అంటే గింజుకునే టిడిపి నాయకులు సిఎం జగన్ పై అవాకులు చెవాకులు ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు.
Also Read : 160 సీట్లు ఖాయం : అచ్చెన్నాయుడు ధీమా