House Committee: పెగాసస్ ఆరోపణలు, వ్యవహారంపై హౌస్ కమిటీ వేయాలని రాష్ట్ర శాసనసభ నిర్ణయించింది. పెగాసస్ స్పై వేర్ ను 2017లో నాటి చంద్రబాబు ప్రభుత్వం కొనుగోలు చేసిందని, దీనికోసం నాటి ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వర రావు రెండు సార్లు ఇజ్రాయెల్ వెళ్ళారన్న సమాచారం ఉందని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి శాసన సభలో వెల్లడించారు. ఒకవేళ ఈ స్పై వేర్ వాడి ఉంటే దీనికన్నా దుర్మార్గమైన విషయం మరొకటి ఉండదన్నారు. అన్ని అంశాలనూ పరిగణన లోకి తీసుకొని సమగ్ర విచారణ కోసం హౌస్ కమిటీ ని నియమించాలని స్పీకర్ కు విజ్ఞప్తి చేశారు.
సభలో మెజార్టీ సభ్యుల సూచనల మేరకు పెగాసస్ వ్యవహారంపై హౌస్ కమిటీని నియమిస్తానని, రెండ్రోజుల్లో కమిటీ సభ్యుల పేర్లు వెల్లడిస్తానని స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు.
కాగా, పెగాసస్ అంశంలో తనపై వస్తున్న ఆరోపణలను ఇంటలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వర రావు ఖండించారు. పెగాసస్ సాఫ్ట్ వేర్ ను కొనలేదన్న విషయాన్ని నాటి డిజిపి గౌతమ్ సావాంగ్ వెల్లడించారని ఏబీ గుర్తు చేశారు. 2019 మే నెలాఖరు వరకూ పోలీసు శాఖ, మరే ఇతర ప్రభుత్వ విభాగం పెగాసస్ ను కొనుగోలు చేయలేదని ఈ విషయాన్ని తాను స్పష్టంగా చెప్పగలనని, ఆ తర్వాత ఏం జరిగిందో తనకు తెలియదని వ్యాఖ్యానించారు.
మరోవైపు, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా దీనిపై స్పందించారు. హౌస్ కమిటి తో పాటు జ్యుడిషియల్, సిబిఐ.. ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. మమతా బెనర్జీ ఈ విషయమై పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో మాట్లాడారా లేదా అనే విషయంలో కూడా స్పష్టత లేదన్నారు. మమత బెంగాల్ లో మాట్లాడిన అంశాల్లో పెగాసస్ విషయం లేదని తెలిసిందన్నారు. ఎవరి వ్యక్తిగత విషయాలు వినే అలవాటు తమకు లేదని బదులిచ్చారు.
ఇవి కూడా చదవండి: చౌకబారు ఆరోపణలు:పెగాసస్ పై అచ్చెన్న