Saturday, November 23, 2024
HomeTrending Newsరోశయ్యకు అసెంబ్లీ ఘన నివాళి

రోశయ్యకు అసెంబ్లీ ఘన నివాళి

Tributes to Rosaiah: ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్యకు ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఘనంగా నివాళులర్పించింది.  రోశయ్య ఏ బాధ్యత నిర్వహించినా  అందరికీ ఆదర్శంగా నిలిచారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొనియాడారు.  తన తండ్రి వైఎస్ కు కూడా రోశయ్య ఎంతో అప్తుడిగా ఉన్నారని, ఇద్దరి మధ్య ఎంతో స్నేహ భావం ఉండేదని సిఎం గుర్తు చేసుకున్నారు.  16సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన అరుదైన నేతగా ఆయన గుర్తింపు పొందారని సిఎం అన్నారు.

ఎన్జీరంగా శిష్యుడిగా రాజకీయ ఆరంగ్రేటం చేసిన రోశయ్యది తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేకమైనదని టిడిపి ఉప నేత అచ్చెన్నాయుడు ప్రశంసించారు. తెలుగు రాష్ట్రాల్లో ఇన్ని పదవులు చేసిన వ్యక్తులు లేరన్నారు.  ఎప్పుడూ స్పోర్టివ్ గా ఉండేవారన్నారు. ఉమ్మడి రాష్ట్రానికి ఆయన చేసిన సేవలకు గుర్తుగా ఏదైనా ఒక స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. మాజీ సిఎంలు వెంగళరావు,  కోట్ల విజయ భాస్కర్ రెడ్డిలు చనిపోయినప్పుడు నాటి సిఎం చంద్రబాబు వారి పేరిట పార్కులు ఏర్పాటు చేసి గౌరవించారని గుర్తు చేశారు.

ఒంగోలులో రోశయ్య కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తామని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.  రోశయ్య మరణం తెలుగు ప్రజలందరికీ బాధాకరమైన వార్త అని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. అసెంబ్లీ రూల్స్ తెలిసినా కూడా టిడిపి నేతలు రోశయ్య సంతాప తీర్మానం విషయాన్ని కూడా రాజకీయం చేశారని వెల్లంపల్లి విమర్శించారు.

రాజకీయ రంగంలో  రోశయ్యది ఓ విలక్షణమైన అధ్యాయమని మాజీ మంత్రి అనం రామనారాయణ రెడ్డి అభివర్ణించారు. ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా అయన పాత్ర విలక్షణమైనదని, ఐదుగురు ముఖ్యమంత్రుల వద్ద ఎంతో సమన్వయంతో పనిచేశారని నివాళులర్పించారు. తాము ఎప్పుడైనా పరుషంగా మాట్లాడినా ఆయన నవ్వుతూ సమాధానమిచ్చేవారని గుర్తు చేసుకున్నారు. వైఎస్ మరణం సమయంలో పెద్దదిక్కుగా సిఎంగా బాధ్యతలు చేపట్టారని చెప్పారు. రోశయ్య లాంటి అరుదైన నేతల ప్రసంగాలను డిజిటలైజ్ చేసి కొత్తగా వస్తున్న సభ్యులకు అందించాలని ఆనం సూచించారు.

ఇవి కూడా చదవండి:సంగం బ్యారేజీకి గౌతమ్ రెడ్డి పేరు : సిఎం

RELATED ARTICLES

Most Popular

న్యూస్