Speaker Anger: శాసనసభలో తెలుగుదేశం పార్టీ సభ్యుల తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జంగారెడ్డి గూడెం మరణాలపై చర్చ చేపట్టాలంటూ నేడు కూడా టిడిపి సభ్యులు ఆందోళన చేపట్టారు. ఈ అంశంపై వారు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించి ప్రశ్నోత్తరాలను కొనసాగించారు. ఈ సమయంలో టిడిపి సభ్యులు నినాదాలు చేశారు, కాసేపటికి బల్లలు చరుస్తూ, ఖాళీ వాటర్ బాటిళ్ళను బల్లపై చరుస్తూ నిరసన కొనసాగించారు, ఈ సమయంలో స్పీకర్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘గౌరవ శాసన సభ్యులం,. మనం వీధి రౌడీలం కాదు, ఇది బజారు కాదు, ఇది శాసన సభ, గౌరవంగా వ్యవహరించాలి… మీరు మీ స్థానాల్లో కూర్చోవాలి.. మరీ సంస్కారం లేకుండా, మర్యాద లేకుండా వ్యవహరించవద్దు. ప్రతిపక్షం అంటే కేకలు వేయడమే అనుకుంటున్నారా, నిర్మాణాత్మకంగా వ్యవహరించండి’ అంటూ వారిని మందలించారు. ఈరోజు సభలో ఉన్న తెలుగుదేశం పార్టీ సభ్యులందరినీ ఒకరోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించి వారిని బైటకు వెళ్లాల్సిందిగా సూచించారు.
ఈ సభకు నేను రానంటూ ఉత్తర కుమార ప్రగాల్భాలు పలికిన చంద్రబాబు బైట ఎక్కడో ఉండి ఈ సభలు నియంత్రించాలని చూస్తున్నారని, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించవద్దని వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు స్పీకర్ ను కోరారు.
కార్తీక మాసంలో అయ్యప్ప మాల వేసుకుంటే లిక్కర్ వినియోగం తగ్గుతుందని వ్యాఖ్యానించిన వ్యక్తి చంద్రబాబు అని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. అలాంటి పార్టీ సభ్యులు మద్యంపై మాటలాడడం సిగ్గుచేటని, టిడిపి సభ్యుల డ్రామాలను సభలో అనుమతించవద్దని స్పీకర్ కు విజ్ఞప్తి చేశారు.
స్పీకర్ వారి సూచలనతో ఏకీభవిస్తూ ఎథిక్స్ కమిటీ కి ఈ అంశాలన్నీ నివేదించి తగిన నిబంధనలు రూపొందించేందుకు తగిన ఆదేశాలు, సూచనలు ఇస్తున్నట్లు ప్రకటించారు.
Also Read : గూడెంలో కల్తీ మద్యం ఆధారాలు లేవు