Manjeeras in Assembly: అసెంబ్లీలో నిన్న విజిల్స్ వేసిన తెలుగుదేశం పార్టీ సభ్యులు నేడు చిడతలు వాయించి నిరసన తెలిపారు. జంగారెడ్డిగూడెం మరణాలపై వెంటనే చర్చ చేపట్టాలంటూ టిడిపి ఎమ్మెల్యేలు నిరసన తెలుపుతూ నినాదాలు చేశారు, పోడియం వద్దకు వచ్చి చిడతలు వాయించడం మొదలు పెట్టారు. దీనిపై స్పీకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
టిడిపి సభ్యుల ప్రవర్తన రోజురోజుకీ దిగజారుతోందని, ఇంగిత జ్ఞానం ఉండే ప్రవర్తిస్తున్నారా, సభ ఔన్నత్యాన్ని దిగజారుస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, జక్కంపూడి రాజా, మల్లాది విష్ణు, జోగి రమేష్, ఆర్థర్, సుధాకర్ బాబు లు మాట్లాడుతూ టిడిపి సభ్యుల ప్రవర్తనను తీవ్రంగా ఖండించారు. వారు ఉద్దేశపూర్వకంగానే సభను అడ్డుకుంటున్నారని, వారు తమ హక్కులను కూడా హరిస్తున్నారని, టిడిపి సభ్యులపై వెంటనే చర్యలు తీసుకొని సభ సజావుగా నడిపేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బైట ఉండి సభ్యులపై ఒత్తిడి తెచ్చి సభలో ఆందోళన చేయిస్తున్నారని, బాబును నమ్ముకుంటే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని హితవు పలికారు. సభ సజావుగా జరిగేందుకు సహకరించాలని సూచించారు.
Also Read : టిడిపి సభ్యులపై స్పీకర్ ఆగ్రహం