వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాబోదని బిజెపి ఏపి అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎలా ఉందో భవిష్యత్ లోనూ అలాగే ఉంటుందని స్పష్టంచేశారు. ఒంగోలులో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు హయాంలో స్పిన్నింగ్ మిల్లులు, డెయిరీ ఫాంలు, షుగర్ ఫ్యాక్టరీలను ప్రైవేటుపరం చేశారని వీర్రాజు విమర్శించారు. గత ప్రభుత్వాల హయాంలో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేశారన్నారు. ఒకవైపు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీరణ వైపు కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులేస్తుంటే, సోము ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కృష్ణాజలాల విషయంలో రెండురాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్, కేసియార్ కుమ్మక్కయారని, పగలు పోరాటం చేస్తూ, రాత్రిళ్ళు ఫోన్ లో దోస్తీ చేసుకుంటున్నారని ఆరోపించారు. హుజురాబాద్ ఉపఎన్నిక కోసమే ఈ వివాదాన్ని కేసియార్ తెరపైకి తీసుకొచ్చారని అన్నారు. ముఖ్యమత్రులు ఇద్దరు కలిసి చర్చిస్తే సమస్య పరిష్కారం లభిస్తుందని చెప్పారు.
రాయలసీమకు నికర జలాలు ఇవ్వాలని, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని సోము డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కేంద్రం నుంచి నిధులు వరదలా వస్తుంటే… రాష్ట్రంలో అప్పుల వరద పారుతోందని అయన ఎద్దేవా చేశారు. ఒంగోలుకు కేంద్రం ప్రకటించిన రక్షణ శాఖ సంస్థను త్వరగా ఏర్పాటు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు.