రాష్ట్ర ప్రభుత్వం అనధికారికంగా తీసుకు వస్తున్న అప్పులపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి డిమాండ్ చేశారు. కార్పొరేషన్ల పేరిట అప్పులు తెస్తున్నా వాటిని ఆయా వర్గాల సంక్షేమానికి వినియోగించడం లేదని విమర్శించారు. అభివృద్ధిని పూర్తిగా విస్మరించి ఓటు బ్యాంకు రాజకీయాలపైనే దృష్టి సారిస్తున్నారని వ్యాఖ్యానించారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. మద్యంపై రాబోయే ఆదాయాన్ని తాకట్టు పెట్టి మరీ అప్పులు తీసుకురావడం చరిత్రలో ఎక్కడా చూడలేదని ఎద్దేవా చేశారు.
విభజన తరువాత రాష్ట్రం నవ్యాంధ్ర, స్వర్ణాంధ్ర ప్రదేశ్ కావాలని కలలు కన్నామని, కానీ ఇప్పుడు అప్పుల, అంధకార, అవినీతి ఆంధ్రప్రదేశ్ గా మారిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగేళ్ళలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం 7,14,631 కోట్లు అప్పు చేసిందని, దీనిలో అధికారికంగా చేసింది 2,39,716 కోట్లు కాగా అనధికారికంగా 4,74,315 కోట్ల రూపాయలు అప్పులు చేసిందని వివరించారు. టిడిపి అధికారంనుంచి దిగిపోయే నాటికి ఉన్న అప్పు 3,62,375 కోట్లు ఉందని, మొత్తం కలుపుకుంటే రాష్ట్రం అప్పు 10 లక్షల 77వేల 006 కోట్ల రూపాయలకు చేరిందని గణాంకాలతో సహా వెల్లడించారు. రాష్ట్రానికి 90 వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని, కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా 35 వేల కోట్ల రూపాయలు వస్తుందని.. ఈ ఆదాయంలో 50వేల కోట్ల రూపాయలు కేవలం వడ్డీలే కట్టాల్సి వస్తోందని ఆమె ఆందోళన వెలిబుచ్చారు.
ఇన్ని అప్పులు ఉన్నప్పుడు అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ఆమె ప్రశ్నించారు. ఆస్తులు సమకూర్చాల్సిన సంగతి పక్కనపెట్టి అసలు ఉన్న ఆస్తులు తనఖా పెట్టి అప్పులు తెస్తున్నారన్నారు. ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,వారు వడ్డీలు తెచ్చి పనులు చేస్తారని, అప్పుల బాధకు కొంతమంది ఆత్మహత్యకు పాల్పడడం బాధాకరమని అన్నారు. పంచాయతీ సర్పంచ్ లు కూడా దీనావస్థలో ఉన్నారని, కేంద్రం నిధులు మంజూరు చేస్తుంటే వాటిలో 70 శాతం ముందే లాక్కుంటున్నారని, మిగిలిన 30 శాతం కూడా వారికి సరిగా అందలేని దుస్థితి ఉందన్నారు. త్వరలోనే తమ మిత్రపక్షం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో సమావేశమవుతానని పురంధేశ్వరి చెప్పారు.