Saturday, January 18, 2025
HomeTrending Newsచర్చకు వస్తారా?: వీర్రాజు సవాల్

చర్చకు వస్తారా?: వీర్రాజు సవాల్

రాయచోటిలో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఇసుక దందాకు పాల్పడుతున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. రాత్రి పగలు తేడా లేకుండా ఇసుకను అమ్ముకుంటున్నారని విమర్శించారు. శ్రీకాంత్ రెడ్డి నిన్న బిజెపిపై చేసిన ఆరోపణలను వీర్రాజు తీవ్రంగా ఖండించారు. రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించిందని, అభివృద్దే లక్ష్యంగా బిజెపి పనిచేస్తుందని అన్నారు. బద్వేల్ లో కేంద్ర ప్రభుత్వ నిధులతో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చకు సిద్ధంగా ఉన్నామని, తమ సవాల్ ను స్వీకరించే సత్తా, దమ్ము ధైర్యం వైఎస్సార్సీపీ నేతలకు ఉందా అని సోము ప్రశ్నించారు. మీరు చర్చకు వస్తామనే మా అభ్యర్ధి కూడా దీటుగా చర్చలో పాల్గొంటారని వెల్లడించారు. బద్వేల్ ఉపఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం పారా మిలిటరీ బృందాలను పంపిందని, ఈ విషయాన్ని జీర్ణించుకోలేని శ్రీకాంత్ రెడ్డి, వైసీపీ నేతలు తమపై ఆరోపణలు చేస్తున్నారని వీర్రాజు మండిపడ్డారు.

బద్వేల్ లో భూ ఆక్రమణలు జరుగుతున్నాయని, బాధితులకు బిజెపి అండగా ఉండి, వారి భూములు వెనక్కి ఇప్పించేలా పోరాడుతుందని వీర్రాజు హామీ ఇచ్చారు. తమ పార్టీని గెలిపిస్తే గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తామని, నియోజకవర్గంలో నెలకొన్న మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

బద్వేల్ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం పంపిన బలగాల ద్వారా పరేడ్ నిర్వహించి ఓటర్లలో విశ్వాసం పెంపొందించాలని బద్వేలు ఎన్నికల పరిశీలకులు భీష్మ కుమార్ కు బిజెపి నేతలు నిన్న వినతి పత్రం సమర్పించారు. దీనిపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి చేసిన విమర్శలపై సోము నేడు స్పందించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్