హుజురాబాద్ ఉప ఎన్నికల్లో సెంటిమెంట్ రగిల్చి ఓట్లు దండుకోవడానికే రాయలసీమ ఎత్తిపోతల పథకం అంశాన్ని ఉపయోగించుకుంటున్నారని ఏపి బిజెపి ప్రధాన కార్యదర్శి ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణా క్యాబినెట్ సమావేశంలో సిఎం కేసీఆర్ ఈ అంశాన్ని ప్రస్తావించడం, ఆ తర్వాత రెండు రాష్ట్రాల మంత్రులు, నేతలు మాట్లాడడం, మరోవైపు ఏపి సిఎం జగన్ దీనిపై కనీసం స్పందిచకపోవడం చూస్తుంటే ఇద్దరూ కలిసి డ్రామాలు ఆడుతున్నట్లు కనిపిస్తోందని విష్ణు అనుమానం వ్యక్తం చేశారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టే రాజకీయ డ్రామాలను ఆపాలని విజ్ఞప్తి చేశారు
ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి అక్రమ ప్రాజెక్టులు లేవని విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. తమకు కేటాయించిన నీటినే ఏపి వాడుకుంటోందని రాయన సీమ ఎత్తిపోతల పథకంపై అనవసర వివాదం సృష్టిస్తున్నారని అయన ఆరోపించారు. రాయలసీమ ప్రాంతం సాగు నీరు కాదు కదా తాగడానికే నీరు లేని ప్రాంతమని, ఈ విషయాన్ని స్వయంగా కేసీయార్ గతంలో చెప్పారని గుర్తు చేశారు.
భారతీయ జనతా పార్టీకి రెండు రాష్ట్రాల ప్రజలు, రెండు రాష్ట్రాల నీటి ప్రయోజనాలు ముఖ్యమేనని విష్ణు వ్యాఖ్యానించారు. నీటి సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, రెండు రాష్ట్రాల సిఎంలూ ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.