Monday, July 1, 2024
HomeTrending Newsఎదుట ఎర్ర జెండా-  వెనక పచ్చ అజెండా:  సిఎం జగన్

ఎదుట ఎర్ర జెండా-  వెనక పచ్చ అజెండా:  సిఎం జగన్

Fire on Left parties: ఉద్యోగులు సమ్మెకు వెళ్ళకపోవడం కొందరికి కంటగింపుగా మారిందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు.  సమ్మెకు వెళ్ళాలని ఎవరూ కోరుకోరని, ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి వారి సమస్యలు పరిష్కరించి సమ్మెను నివారించామని చెప్పారు. చంద్రబాబు సిఎం కాలేదన్న బాధ, కడుపు మంట ఉన్న  వారే సమ్మెను కోరుకుంటున్నారని చెప్పారు. ‘పార్టీల పరంగా ఎర్ర జెండా వారికి, బాబు దత్తపుత్రుడికి, మీడియా ముసుగులో ఉన్న కొంతమంది వ్యక్తులకు సమ్మె కావాలి’ అంటూ వ్యాఖ్యానించారు.  ‘సమ్మె జరుగుతుందంటే వీరికి పండుగ, సంధి జరిగింది అంటే ఏడుపు మొహం పెట్టారు’ అంటూ దుయ్యబట్టారు.  పచ్చ జెండా మోస్తున్న  ఓ ఎర్ర బాబును ముందుకు తోశారని, రాష్ట్రంలో  వామపక్ష నేతల తీరు ‘ఎదుట ఎర్ర జెండా- వెనుక పచ్చ అజెండా’ అన్నట్లుగా ఉందన్నారు.

రెండో ఏడాది ‘జగనన్న తోడు’ కింద రజక, నాయీబ్రాహ్మణ, దర్జీలకు  రాష్ట్రవ్యాప్తంగా 2,85,350 మంది లబ్ధిదారులకు 285.35 కోట్ల రూపాయల ఆర్ధిక సాయాన్ని నేడు విడుదల చేశారు.  ఈ సందర్భంగా మాట్లాడిన సిఎం జగన్ కమ్యూనిస్ట్ పార్టీలపై నిప్పులు చెరిగారు.  పచ్చ జెండాలు, ఎర్ర జెండాలు రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేయాలని చూస్తున్నాయని విమర్శించారు.  ఉద్యోగుల సమస్యలు సామరస్యంగా పరిష్కారం కావడంలో భాగస్వామ్యం అయిన కొన్ని లెఫ్ట్ పార్టీల అనుబంధ సంఘాల నేతలు లోపల సంతకాలు పెట్టారని, మరుసటి రోజు పోరుబాట పడతామని ఆయా పార్టీలకు చెందిన కొన్ని ఉపాధ్యాయ సంఘాలు చెప్పడం బాధాకరమన్నారు.

కోవిడ్ వల్ల రెండేళ్లుగా పరీక్షలు నిర్వహించుకో లేకపోయామని, ఇప్పుడు మూడో సంవత్సరం అయినా  పరీక్షలు పెట్టాలని నిర్ణయించామని, పరీక్షల తేదీలు దగ్గర పడుతున్న సమయంలో  ఇలా సమ్మె అంటూ  టీచర్లను  రోడ్డెక్కిస్తే పిల్లల చదువులు ఏం కావాలని సిఎం ప్రశ్నించారు.

ప్రపంచ కమ్యూనిస్ట్ చరిత్రలో  ఎన్నడూ జరగని విధంగా చంద్రబాబు బినామీ వ్యక్తుల రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం, అమరావతి రాజధానిపై కామ్రేడ్ సోదరులు జెండాలు పట్టుకునే పరిస్థితి రావడం శోచనీయమన్నారు.  అమరావతిలో పేదలకు ఇళ్లు ఇవ్వడం కోసం స్థలాలు కేటాయిస్తే సామాజిక సమతుల్యం దెబ్బ తింటుందని కోర్టుల్లో  పిటిషన్ వేసిన చంద్రబాబు లాంటి వ్యక్తులకు  కమ్యూనిస్ట్ లు మద్దతివ్వడం బాధాకరమన్నారు. ఎదుట ఎర్ర జెండా – వెనక పచ్చ జెండా అన్నట్లుగా వారి పరిస్థితి తయారైందన్నారు

ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని మాట్లాడిన చంద్రబాబు లాంటి వ్యక్తీ, బీసీల తోకలు కట్టిరిస్తానన్న అహంకారి కొన్ని మీడియా సంస్థలకు ముద్దుబిడ్డగా కనిపిస్తున్నారని,  బీసీలు జడ్జిలుగా పకినిరారని ఏకంగా  కేంద్రానికి లేఖ రాసిన వ్యక్తీ ఎర్ర జెండాలకు ఆత్మీయుడిగా మారారని ఆరోపించారు.

Also Read : నేడు రెండో ఏడాది ‘జగనన్న తోడు’

RELATED ARTICLES

Most Popular

న్యూస్