Review on Omicron :
ఒమిక్రాన్ వేరియెంట్ నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకున్నామని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వివరించారు. ఆంధ్ర ప్రదేశ్లో ఓ కేసు వెలుగు చూసిన నేపధ్యంలో ఓమిక్రాన్ వేరియంట్ విషయంలో తీసుకుంటున్న చర్యలపై సిఎం జగన్ క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఎయిర్‌పోర్టుల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తున్నామని, ఒమిక్రాన్ నేపథ్యంలో ఆంక్షలు విధిస్తున్నామని, మరో వారంరోజుల్లో రాష్ట్రంలో జినోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నామని అధికారులు సమావేశంలో వివరించారు. ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నామని, ప్రస్తుతం 32వ దఫా ఫీవర్ సర్వే కొనసాగుతుందని చెప్పారు.
రాష్ట్ర వ్యాప్తంగా వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్ పూర్తిచేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని సిఎం జగన్ ఆదేశించారు. కేంద్రంతో సమన్వయం చేసుకుని జవనరిలోగా నిర్దేశించిన వయసు లోపు వారందరికీ కూడా డబుల్ డోస్ ఇచ్చేలా చూడాలని నిర్దేశించారు. వ్యాక్సినేషన్‌ను వీలైనంత త్వరగా పూర్తిచేయడమే కోవిడ్ నివారణలో ఉన్న ప్రధానమైన పరిష్కారమని సిఎం అభిప్రాయపడ్డారు. థర్డ్ వేవ్ సన్నద్ధత, విలేజ్, అర్బన్ క్లినిక్స్ నిర్మాణం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాడు– నేడు పనుల ప్రగతి, ఆరోగ్యశ్రీ, ఆరోగ్యమిత్ర, 108,104 సేవలు, ఆరోగ్య శ్రీ – ప్రత్యేక యాప్, సిబ్బంది భర్తీ అంశాలపై కూడా సిఎం సమగ్రంగా సమీక్ష జరిపారు.
ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి (వైద్య ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్(నాని), సీఎస్ సమీర్ శర్మ, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, వైద్య ఆరోగ్యశాఖ(వ్యాక్సినేషన్ అండ్ కోవిడ్ మేనేజిమెంట్) ఎం రవిచంద్ర, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, 104 కాల్ సెంటర్ ఇంఛార్జి ఎ బాబు, వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జీ ఎస్ నవీన్ కుమార్, ఏపీఎంస్‌ఐడీసీ వీసీ అండ్ ఎండీ డి మురళీధర్ రెడ్డి, ఆరోగ్యశ్రీ సీఈఓ వి వినయ్ చంద్, వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ (డ్రగ్స్) రవి శంకర్, ఏపీవీవీపీ కమిషనర్ డాక్టర్ వి వినోద్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Also Read : ఓమిక్రాన్ ఎంత ప్రమాదకరం ?