Saturday, January 18, 2025
HomeTrending Newsతెలంగాణాలో తలదూర్చం: జగన్

తెలంగాణాలో తలదూర్చం: జగన్

Telangana Politics :

తెలంగాణా రాజకీయాల్లో ఎప్పుడూ వేలు పెట్టలేదని, రాబోయే రోజుల్లో కూడా వేలుపెట్టే ప్రసక్తే లేదని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తేల్చి చెప్పారు. తమిళనాడు, కర్నాటక రాజకీయాల్లో కూడా తమకేమీ సంబంధం ఉండబోదని వెల్లడించారు. ఏ ఒక్క పొరుగు రాష్ట్రంతో విభేదాలు కోరుకోవడం లేదని, సత్సంబంధాలే ఉండాలని ఆశిస్తున్నామని, అలా ఉండాలంటే పాలకుల మధ్య కూడా సఖ్యత ఉండాలని మనసారా కోరుకుంటున్నట్లు జగన్ స్పష్టం చేశారు. నీటి సమస్యలకు సామరస్యంతో పరిష్కార మార్గాలు వెతకాలని, దానికి సహకరించాలని తెలంగాణా సిఎం కేసియార్ కు పరోక్షంగా విజ్ఞప్తి చేశారు.

తమ రాష్ట్రానికి హక్కుగా కేటాయించిన నీటిని రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా వాడుకుంటే తప్పేంటని సిఎం జగన్ ప్రశ్నించారు. శ్రీశైలంలో నీటి మట్టం 800 అడుగులలోపు ఉన్నప్పుడే తెలంగాణా రాష్ట్రం తనకు కేటాయించిన నీటిని వాడుకుంటే తప్పులేనప్పుడు…తాము కూడా రాయలసీమ లిఫ్ట్ పెట్టి  మా హక్కుగా కేటాయించిన వాటాను వాడుకుంటే తప్పేమిటని నిలదీశారు. రైతు ఎక్కడున్నా రైతేనని, వారూ బతకాలి, మనమూ బతకాలి అని వ్యాఖ్యానించారు. రైతులకు సాగునీరు, ప్రజలకు తాగు నీరు ఇవ్వడానికి అందరం ఒక్కటి కావాలని పిలుపు ఇచ్చారు. నీటి విషయాల్లో రాజకీయాలు జరుగుతుంటే చూడలేకే తాను స్పందించానన్నారు.

రాయదుర్గంలో రైతు దినోత్సవం సందర్భంగా జరిగిన బహిరంగ సభలో కృష్ణా జలాల వివాదంపై సిఎం జగన్ స్పందించారు. కృష్ణాజలాల విషయంలో తెలంగాణకు సంబంధించిన కొంతమంది మంత్రులు, నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని జగన్ అసహనం వ్యక్తం చేశారు. నాలుగురోజుల పాటు గమ్మున ఉన్న చంద్రబాబు కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారని, వారికి సమాధానం చెప్పల్సినందునే ఈ విషయమై మాట్లాడుతున్నానని జగన్ అన్నారు. చంద్రబాబు సిఎంగా ఉన్నప్పుడే కేసియార్ పాలమూరు-రంగారెడ్డి, దిండి ప్రాజెక్టులు మొదలుపెట్టారని, అప్పుడు ఏమి గాడిదలు కాస్తున్నారని తీవ్రంగా ధ్వజమెత్తారు.

2015 జూన్ 19న కృష్ణాజలాలపై కేంద్ర ప్రభుత్వం సమక్షంలో రెండు రాష్ట్రాలకు కేటాయింపులు చేశారని, దీని ప్రకారం రాయలసీమకు 144, కోస్తాంధ్రకు 367, తెలంగాణకు 298  టిఎంసీలు చొప్పున నిర్ణయం జరిగిందని, దీనిపై  ముగ్గురు సంతకాలు చేశారని జగన్ గుర్తు చేశారు.

శ్రీశైలం పూర్తి సామర్ధ్యం 885 అడుగులని, గత 20 సంవత్సరాలుగా కేవలం 20 రోజులు కూడా 881 అడుగుల  నీటిమట్టం ఉందని చెప్పలేని పరిస్థితి ఉందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. 881 అడుగులకు చేరితేనే పోతిరెడ్డిపాడు నుంచి నీరు కిందకు వస్తుందన్నారు. ఈ పరిస్థితుల్లోనే తెలంగాణా రాష్ట్రం పాలమూరు-రంగారెడ్డి, దిండి ప్రాజెక్టులు,  కల్వకుర్తి సామర్ధ్యం పెంచారని.. వీటన్నిటికి 800 అడుగులలోపే నీరు వాడుకునే వెసులుబాటు ఉందని, దీనికి తోడు 796 అడుగుల్లోపే విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారని జగన్ వివరించారు. ఈ పరిస్థితుల్లో తమ వాటా వాడుకోవడం కోసమే రాయలసీమ లిఫ్ట్ కడుతున్నామని చెప్పారు.  ఈ ఏడాది కూడా మంచిగా వర్షాలు పదాలని, రైతన్నకు ఇంకా మంచి చేసే అవకాశం ఇచ్చేలా దేవుడు దీవిచాలని జగన్ ఆకాంక్షించారు.

Also Read : రంగు రాళ్లు-మోసగాళ్లు

RELATED ARTICLES

Most Popular

న్యూస్